Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

Rain Alert for Andhra Pradesh: ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..

jagan 15 Oct 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
Rain Alert for Andhra Pradesh: ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..

Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్ వాతావరణం..

Rain Alert for Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మారనుంది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఏపీఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపించనుంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు పోలవరం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో పాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వివరించారు.

వర్షాలు, పిడుగుల ప్రమాదం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో, భారీ హోర్డింగుల కింద నిలబడకూడదని హెచ్చరించింది. వీలైనంత త్వరగా సురక్షితమైన పక్కా భవనాల్లోకి వెళ్లాలని సూచించింది.

ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులు ప్రారంభమైనప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను గమనించాలని, స్థానిక అధికారులు సూచించే జాగ్రత్తలను పాటించాలని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది.