మానవాళికి అన్నం పెడుతున్న గ్రామీణ మహిళా రైతులు
Woman Farmer
(అక్టోబర్ 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా)
లింగ సమానత్వాన్ని సాధించడంతో పాటు మహిళలకు సాధికారత కల్పించడం అనేది కేవలం ముఖ్యమైనదే కాకుండా, తీవ్ర పేదరికం, ఆకలి, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఒక కీలకమైన అంశం కూడా అని తెలుసుకోవాలి. పర్యా వరణం, జీవవైవిధ్య పరిరక్షణలో పనిచేస్తూనే, ప్రపంచ ఆహార ఉత్పత్తిలో సగం వరకు మహిళలే బాధ్యత వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతా ల్లోని మహిళలు, బాలికలు బహుముఖ పేదరికంతో అసమానతల విష వలయం లో చిక్కుకొని బాధపడుతున్నారు. మహిళలు పురుషులతో సమానంగా ఉత్పాదకత, వ్యాపార దక్షతను కలిగి ఉన్నప్పటికీ, భూమి, రుణాలు, వ్యవసాయ ఉత్పాదకాలు, మార్కెట్లు, ఉత్పాదక వనరులు, ఆస్తులు, ప్రభుత్వ సేవలు, విద్యా సౌకర్యాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదు పాయాలు, నీరు, పారిశుద్ధ్యం, వేతనం లేని కార్మిక సమస్యలు, అధిక విలువ గల వ్యవసాయ -ఆహార గొలుసు వంటి వాటిని పొందడంలో తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు, తమ పంటలకు తక్కువ ధరలను కూడా పొందుతున్నారు.
అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం
ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిని పెంపొందించడంలో గ్రామీణ మహిళల ప్రాముఖ్యతను గుర్తించిన ఐక్యరాజ్యసమితి 2007లో అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించి, ప్రతి ఏటా అక్టోబర్ 15న గ్రామీణ మహిళల పాత్రను వేడుకగా జరుపుకుం టుంది, సముచితంగా గౌరవిస్తుంది. ‘గ్రామీణ’ అనే పదానికి సౌకర్యాలు, మానవ హక్కులు పరిమితంగా లేదా అందుబాటులో లేని మారుమూల లేదా గ్రామ ప్రాంతాలు అని అర్థం చేసుకోవాలి. ఈ గ్రామీణ ప్రాంతాలలో, మహిళలు విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ-ఆధారిత హింస, వివక్ష, చట్ట పరమైన హక్కులు, గౌరవప్రదమైన ఉపాధి హక్కులతో సహా వివిధ సవాళ్లను ఎదుర్కొంటారు. వ్యవసాయంతో పాటు గ్రామీణాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం, ఆహార భద్రతను పెంచడం, గ్రామీణ పేదరికాన్ని నిర్మూలిం చడం, గిరిజన మహిళలతో సహా గ్రామీణ మహిళల ముఖ్యమైన పాత్రను గుర్తించడం, పలురకాల అవగాహన కల్పించడం లాంటివి ఈ రోజు లక్ష్యాలు అని తెలుసుకోవాలి. గ్రామీణ మహిళలు పౌర సమాజాలకు అన్నం పెడుతూ, జీవనోపాధిని నిలబెడుతూ, మనమందరం ఆధారపడే సహజ వనరులను కాపాడుతున్నారు. ఈ రోజున, మరింత సుస్థిర భవిష్య త్తును నిర్మించడంలో వారి జ్ఞానాన్ని, నాయకత్వాన్ని మనం ఆహ్వానిద్దాం.