Singareni Bonus 2026: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక.. లాభాల్లో 34 శాతం బోనస్ ప్రకటన..
Singareni Workers
Singareni Bonus 2026: సింగరేణి కాలరీస్ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్త అందించింది. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమలు , సమాచార శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను, సంక్షేమ హామీలను అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయాలు బొగ్గు గని కార్మిక కుటుంబాల్లో పండుగ ఉత్సాహాన్ని నింపాయి.
సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లోంచి 34 శాతాన్ని కార్మికులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ దసరా పండుగను పురస్కరించుకుని ప్రతీ శాశ్వత కార్మికుడికి రూ. 1,53,903 చొప్పున బోనస్ అందించనున్నారు. అలాగే ఒప్పంద (కాంట్రాక్ట్) ఉద్యోగులకు కూడా ఒక్కొక్కరికి రూ. 5,500 చొప్పున బోనస్ చెల్లించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు నివ్వడానికే ఈ స్థాయిలో లాభాల వాటాను కేటాయించినట్లు తెలిపారు.
కార్మికుల సంక్షేమానికి సంబంధించి పలు విప్లవాత్మక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించింది. సింగరేణిలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగ దరఖాస్తులను రాబోయే 15 రోజుల్లోగా పూర్తిగా క్లియర్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గతంలో మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి మాత్రమే వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేకుండా, కార్మికులు పనిచేస్తున్న ఆయా ఏరియా ఆసుపత్రుల్లోనే మెడికల్ ఇన్వాలిడేషన్ పరిక్షల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి సమయంలో సరైన సమాచారం ఇవ్వలేక విధులకు గైర్హాజరయ్యారనే కారణంతో సస్పెండ్ అయిన కార్మికులందరినీ మానవతా దృక్పథంతో తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. వీటితో పాటు సింగరేణి సంస్థకు చెందిన ఖాళీ భూముల్లో స్థానిక పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు, మైనింగ్ జరగని సురక్షిత భూముల్లో కార్మికుల కోసం ప్రత్యేకంగా హౌసింగ్ కాలనీలను నిర్మించనున్నారు. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేలా ప్రత్యేక వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
సామాజిక బాధ్యతలో భాగంగా సింగరేణి పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తాగునీటి అవసరాల కోసం ఆర్వో (RO) వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సత్తుపల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లోని జూనియర్ కాలేజీల సమగ్ర అభివృద్ధికి కావలసిన మౌలిక వసతులను సింగరేణి సంస్థ ద్వారానే సమకూరుస్తారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపులు వచ్చేలా చూస్తామని చెబుతూ, ఉపయోగంలో లేని సంస్థ భూముల్లో భవిష్యత్తు అవసరాల కోసం సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పుతామని భట్టి విక్రమార్క ప్రకటించారు.