Airtel New Recharge Plan: ఎయిర్‌టెల్ నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్.. రూ.348కే ఏడాది పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ఉచితం!
Smartphones
Airtel New Recharge Plan: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్తగా రూ.348 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్, ఉచిత ఎస్సెమ్మెస్‌లు అందిస్తోంది. వీటితో పాటు సుమారు రూ.4,000 విలువైన అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను 12 నెలల పాటు ఉచితంగా పొందే అవకాశం కల్పించింది. ముఖ్యంగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, విద్యార్థులు, రోజూ ఎక్కువ డేటా వినియోగించే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉండనుంది.
రూ.348 ప్లాన్‌లో ఏం ప్రయోజనాలు?
ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఈ కాలంలో వినియోగదారులకు ప్రతిరోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందుతాయి. అదనంగా ఏడాది పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, స్పామ్ కాల్స్ గురించి అలర్ట్‌లు, మోసపూరిత లింకుల నుంచి రక్షణ కల్పించే ఎయిర్‌టెల్ సేఫ్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. 30 రోజుల పాటు ఉచిత హలోట్యూన్స్ సదుపాయం కూడా లభిస్తుంది.
రూ.349 ప్లాన్‌తో తేడా ఏంటి?
ఎయిర్‌టెల్ ఇప్పటికే రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఈ రెండు ప్లాన్ల ధర మధ్య తేడా కేవలం ఒక్క రూపాయి అయినప్పటికీ, డేటా ప్రయోజనాల్లో వ్యత్యాసం ఉంది. రూ.349 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అర్హత ఉన్న 5జీ నెట్‌వర్క్ ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటా పొందవచ్చు. ఈ ప్లాన్‌లోనూ అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు అందుతాయి. అదనంగా యాపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఆరు నెలల వరకు ఉచితంగా పొందే అవకాశం ఉంది. అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రయోజనాల నిబంధనలను రీఛార్జ్‌కు ముందు పరిశీలించాలి.
మీకు ఏ ప్లాన్ సరైనది?
ఇంకా 4జీ ఫోన్‌నే ఉపయోగిస్తున్నవారు, 5జీ నెట్‌వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఉన్నవారు లేదా రోజువారీ 2 జీబీ డేటా అవసరమయ్యేవారు రూ.348 ప్లాన్‌ను పరిశీలించవచ్చు. ముఖ్యంగా డిజైన్‌లు, పోస్టర్లు, సోషల్ మీడియా కంటెంట్ తయారు చేయడానికి అడోబ్ ఎక్స్‌ప్రెస్‌ను ఉపయోగించే వారికి ఏడాది సబ్‌స్క్రిప్షన్ అదనపు ప్రయోజనం. మరోవైపు 5జీ ఫోన్‌తో పాటు 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉండి, అపరిమిత 5జీ డేటాకు ప్రాధాన్యం ఇచ్చేవారికి రూ.349 ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. రీఛార్జ్ చేసే ముందు తమ ప్రాంతంలో నెట్‌వర్క్ లభ్యత, ప్లాన్‌కు వర్తించే నిబంధనలు, అదనపు సబ్‌స్క్రిప్షన్‌ల అర్హతలను ఎయిర్‌టెల్ యాప్‌లో పరిశీలించడం మంచిది.