Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

సుప్రీంకోర్టుకు రాహుల్‌ పీపుల్స్‌ పిటిషన్‌

Prajapaksham 13 Oct 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
సుప్రీంకోర్టుకు రాహుల్‌ పీపుల్స్‌ పిటిషన్‌

Supreme Court

కొన్ని తరగతుల ఓటర్లపై గురిపెట్టి వారిని తొలగించేందుకై ‘ప్రత్యేక ముమ్మర రివిజన్‌’ ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ పాలక బిజెపి ఎన్నికల అవకాశాలను మెరుగుపరుస్తున్న పక్షపాత రిఫరీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం బర్తరఫ్‌ చేయాలన్న ప్రతిపక్ష ఇండియా కూటమి, పౌరసమాజ సంస్థలు, విద్యార్థి యువజన సంఘాల గొంతుకను బలమైన ప్రజావాణిగా మార్చిన కాంగ్రెస్‌ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధి సోమవారం ఆ వాణిని సుప్రీంకోర్టుకు చేర్చారు. అక్టోబర్‌ 2న, గాంధీ జయంతినాడు ప్రారంభమైన ఈ ప్రతిపక్ష ఆందోళన వివిధ రూపాల్లో వ్యాప్తి చెందుతూ, ఇండియా కూటమి వెలుపలనున్న రాజకీయ, సామాజిక సంస్థలను, ప్రముఖ వ్యక్తులను కలుపుకుంటూ బిజెపిని ‘ఓట్‌ నేరస్థురాలిగా, అక్రమంగా అధికారాన్ని గుంజుకుంటున్న పార్టీగా ప్రజలముందు నిలిపింది. ఓటర్ల జాబితాల్లో తారుమార్లుకు సహకరించటం ద్వారా అనేక నియోజకవర్గాల్లో బిజెపి మైనారిటీ స్థితిని మెజారిటీగా మార్చటానికి విధేయత పూర్వకంగా దోహదం చేసిన వ్యక్తిగా జ్ఞానేశ్‌ కుమార్‌ ఆరోపణలకు గురైనాడు. ఈ కుతంత్రాన్ని పసిగట్టి ఆధారపూర్వకంగా బట్టబయలు చేసిన వ్యక్తి రాహుల్‌గాంధి. 2025లో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు మాసాలముందు హడావిడిగా సర్‌ ప్రక్రియను ప్రారంభించటంలోనే కుత్సితం ఉంది. నింపాదిగా నిర్వహించవలసిన కార్యక్రమాన్ని అంత ఆకస్మికంగా ఆ రాష్ట్రంలోనే ఎందుకు మొదలుపెట్టారు అన్న ప్రశ్నకు జవాబులేదు. హర్యానా, మహారాష్ట్రల్లో ఎన్నికల కమిషన్‌ దొంగనాటకాన్ని రాహుల్‌గాంధి బహిరంగంచేసి, ఇసి నుంచి సంజాయిషీ కోరినప్పుడు జ్ఞానేశ్‌ కుమార్‌ రాజకీయ నాయకుడిలా పత్రికాగోష్టిపెట్టి రాహుల్‌ నుంచి క్షమాపణ డిమాండ్‌ చేశాడు తప్ప, ఆయన ఆరోపణల్లోని వాస్తవం పరీక్షించేందుకు దర్యాప్తు ఆదేశించలేదు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపిని అధికారంలోకి తేవటానికి ఓట్ల తొలగింపుకోసం ఎన్ని అక్రమాలకు ఒడిగట్టారో దేశం ముందు పరిచిన తెల్లకాగితంలా ఉండనే ఉంది. ఓట్ల తొలగింపు అనేది మూడవ దశతో 13కోట్లు దాటింది. తొలగింపుకు గురైన వారిలో అత్యధికులు ముస్లింలు, దళితులు, ఆదివాసీలు, బలహీనవర్గాలు. సర్‌ ప్రక్రియ క్రమంలోనే కొత్త ఓటర్ల చేర్పు ప్రక్రియను కూడా చేర్చి, తొలగించిన సంఖ్యలో ఈ సంఖ్యను తీసివేయటంవల్ల వాస్తవంగా తొలగించబడిన వారి సంఖ్య తక్కువగా కనిపిస్తున్నది. మొత్తం 30రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొత్తగా చేరిన లేదా చేర్చిన ఓటర్ల సంఖ్యను మినహాయించి చూస్తే తొలగించబడిన ఓటర్ల సంఖ్య మరో రెండు కోట్లు ఉంటుంది. ఢిల్లీ ఓటర్లలో మూడవవంతు, అలాగే కర్నాటక, తెంగాణల్లో 20 శాతానికి పైగా ముసాయిదా జాబితానుంచి తొలగించబడిన తర్వాత బిజెపియేతర రాజకీయ పార్టీలు ఉలిక్కిపడ్డాయి, మేల్కొన్నాయి. ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి.
జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా, సర్‌ రద్దు, పాత ఓటర్ల జాబితాల పునరుద్ధరణ, బ్యాలెట్‌ పేపర్‌తో ఎన్నికలు డిమాండ్‌ చేస్తూ గాంధేయ సత్యాగ్రహం పద్ధతిలో ఆందోళన చేస్తుండగా, ఢిల్లీలో 20వేలమందికిపైగా పోలీసు, ఇతర భద్రతా దళాలను సమీకరించి దాన్నొక దుర్గంగా మార్చిన మోదీ ప్రభుత్వం ప్రదర్శకులపట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నది. 60కిపైగా మెట్రో స్టేషన్‌లు మూసివేసి, ఢిల్లీకి వచ్చే రైళ్లను ముందు స్టేషన్‌లలో ఆపుచేసి, రవాణాను స్తంభింపజేసి చుట్టుపక్కల రాష్ట్రాలనుంచి ప్రదర్శకులెవరూ ఢిల్లీ చేరుకోకుండా ఎమర్జెన్సీని తలపించారు. ఇంకా చిత్రమేమంటే జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలో పాల్గొనేందుకు బొంబాయి నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చిన కాక్రోచ్‌ జనతాపార్టీ ముఖ్యనాయకులు ముగ్గుర్నీ విమానంలోనే అరెస్టు చేసిన పోలీసులు అజ్ఞాత ప్రదేశానికి తీసుకెళ్లారు. వాళ్లేమైనా టెర్రరిస్టులా, వాళ్ల దగ్గర ఆయుధాలున్నాయా? రాజకీయ పార్టీల ఆందోళనకు సిజెపి సహా అరడజను విద్యార్థి సంఘాల ఆందోళన తోడు కావటంతో ప్రభుత్వం ఎంతగా జడిసిపోయిందో ఈ ఘటన తెలియజేస్తున్నది.
ఇప్పటికే ప్రతిపక్షాలు కుమార్‌, మోదీ, షా వ్యతిరేక ఆందోళనను ఓటు హక్కు రక్షణకై సాగిస్తున్న ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సఫలీకృతమైనాయి. ఈలోపు, ఎన్నికల కమిషన్‌ వ్యవహారాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌లు, ప్రారంభ విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు ప్రతిపక్షాల పోరాటంలోని నిజాయితీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. ఆదివారం కూడా పోలీసులు ఊపిరి సలుపుకోకుండా ఢిల్లీలో ఆందోళనలు అణచివేతలు కొనసాగాయి. ఈలోపు ఇండియా కూటమి సోమవారం అసాధారణంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌కు మెమొరాండం ఇచ్చేందుకు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నుంచి సుప్రీంకోర్టుకు ర్యాలీ తలపెట్టాయి. కాంగ్రెస్‌ ముఖ్యనాయకులంతా ఢిల్లీ చేరారు. కాని ర్యాలీకి పోలీసు అనుమతి ఇవ్వలేదు. రెండోవైపున సిజెపి పార్టీ జంతర్‌మంతర్‌వద్ద ఆందోళనకు మళ్లీ ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసింది. కాగా ముగ్గురు యువనాయకుల విడుదలను కోర్టు ఆదేశించింది. ఇండియా కూటమి ప్రతినిధి వర్గాన్ని కలుసుకునేందుకు సిజెఐ నిరాకరిస్తూ, కోర్టులో కేసులు ఉన్నందున మీరు కూడా కేసు వేసి విచారణలో చేరండి అని సలహా ఇచ్చారు. తమది రాజకీయ పోరాటం లేదా పార్టీ కార్యక్రమం కాదని, దేశ ప్రజల ఓటుహక్కును, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్యమమని, ఇందులో రాజకీయాలకు అతీతంగా అందరూ చేరాలని రాహుల్‌ గాంధి విజ్ఞప్తి చేశారు. ప్రజల కు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు హరించే కుట్ర కు పాల్పడిన నరేంద్రమోదీ, అమిత్‌ షా, మోహన్‌ భాగవత్‌, అజిత్‌ దోవళ్‌, జ్ఞానేశ్‌ కుమార్‌ ఈ ఐదుగురి కీ చట్టం ప్రకారం శిక్ష పడేవరకు విడిచిపెట్టబోమని హెచ్చరిక చేశారు. ఊహించినట్లే ఇండియా కూటమి ఎంపిలతోపాటు సమాజ్‌వాది, ఆర్‌జెడి నేతలు, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, మంత్రులు, వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో పాటు అసంఖ్యాకంగా ప్రజలు చేరటంతో సుప్రీంకోర్టుకు ప్రజాస్వామ్య రక్షణ ర్యాలీ సాయంత్రం ఘనంగా సాగింది. అక్కడికి చేరుకున్నాక రాహుల్‌గాంధీ, అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్‌పి), తేజస్వీ యాదవ్‌(ఆర్‌జెడి), కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, డి.కె.శివకుమార్‌ తదితరులతో కూడిన బృందం కోర్టువద్దకు వెళ్లగా, మొత్తం 10పార్టీల తరఫున కాంగ్రెస్‌ న్యాయవాదులు తమ కేసును సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి అందజేశారు. ఇక ఒకవైపు న్యాయపోరాటం, రెండోవైపున ప్రజాపోరాటం జమిలిగా సాగుతాయి. ఈ ఉద్యమం మరింత శక్తిమంతమైన జాతీయోద్యమంగా బలం పుంజుకోవాలంటే స్థానిక రాజకీయ వైరుధ్యాలతో ఇండియా కూటమి వెలుపల ఉండి, విడిగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆప్‌, డిఎంకె వగైరా పార్టీలు, తూతూ మంత్రంగా అడపాదడపా ప్రకటనలు చేస్తున్న బిఆర్‌ఎస్‌, వైసిపి పార్టీలు, తమిళనాడు పాలక కూటమి పార్టీలు, వాటి ప్రజాసంఘాలు, ఇండియా కూటమి కార్యక్రమాలతో ఆందోళనను సమన్వయం చేసుకుంటూనే ఒకడుగు దూరం పాటిస్తున్న సిజెపి ఇతర విద్యార్థి యువజన సంఘాలతోపాటు ఓటుహక్కు పరిరక్షణకై సాగుతున్న ఈ ప్రజా స్వామిక ఉద్యమంలో చురుకుగా భాగస్వాములు కావాలి.