కవిత్వపు హద్దులు చెరిపిన అసాధారణ కలం ‘అన్నే కార్సన్’
Anne Carson
సమకాలీన ప్రపంచ సాహిత్యంలో కొన్ని పేర్లు ఒక ప్రక్రియకు, ఒక శైలికి, ఒక సాహిత్య ఉద్యమానికి మాత్రమే పరిమితం కావు. అదే చట్రంలో ఇరుక్కోవు. అవి సాహిత్య ప్రక్రియల మధ్య ఉన్న గోడలనే కూల్చివేస్తాయి. కెనడాకు చెందిన కవి, వ్యాసకర్త, క్లాసిక్స్ అధ్యాపకురాలు, అనువాదకురాలు అన్నే కార్సన్ అలాంటి అరుదైన సాహిత్య వ్యక్తిత్వం. కవిత్వం, గద్యరచన, వ్యాసం, నాటకం, అనువాదం, లిబ్రెట్టో, విమర్శ వంటి ఏ రూపంలో రచన చేసినా, దానిని మరో రూపంతో కలిపి కొత్త సాహిత్య అనుభవాన్ని సృష్టించడం ఆమె ప్రత్యేకత. ‘న్యూయార్క్ టైమ్స్’లో ఒక పుస్తక సమీక్షలో డాఫ్నీ మెర్కిన్ ఒకసారి కార్సన్ గురించి రాస్తూ, సమకాలీన కవిత్వాన్ని గమనించే చిన్న ప్రపంచంలో ఆమె అసూయనూ, అభిమానాన్నీ ఏకకాలంలో రేకెత్తించేంత ప్రభావాన్ని చూపుతున్నారని ప్రశంసించాడు. కార్సన్ రచనలకు విమర్శకుల ప్రశంసలతో పాటు విస్తృత పాఠకాదరణ కూడా లభించింది. ఆమె రచనా ప్రపంచాన్ని ఒకే సాహిత్య ప్రక్రియలో బంధించడం దాదాపు అసాధ్యం. ఈ విశిష్ట సాహితీ సృష్టి ఆమెకు ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని అందించింది. సాఫో, యూరిపిడిస్ వంటి ప్రాచీన గ్రీకు రచయితల అనువాదాల నుంచి ‘యాన్ అరెస్టియా’ వంటి ప్రయోగాత్మక రచనల వరకు ఆమె ప్రయాణం విస్తరించింది. ప్రేమ, ఆకాంక్ష, శారీరక కోరిక, విరహం, నిరాశ, హృదయవేదన తదితర అంశాలు ఆమె కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి. అదే సమయంలో ఆమె రచనల్లో పాండిత్యం, చరిత్ర, పురాణం, తత్వశాస్త్రం కూడా సమాన స్థాయిలో ప్రవహిస్తాయి. 1950, జూన్ 21వ తేదీన, కెనడాలోని టొరంటోలో జన్మించిన కార్సన్‌కు ప్రాచీన గ్రీకు సాహిత్యంతో పరిచయం యాదృచ్ఛికంగానే ఏర్పడింది. పాఠశాల రోజుల్లో లాటిన్ బోధించే ఒక ఉపాధ్యాయుడు భోజన విరామ సమయంలో ఆమెకు ప్రాచీన గ్రీకు భాష నేర్పడానికి ముందుకు రావడం ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. ఆ పరిచయం క్రమంగా గ్రీకు, హెల్లెనిక్ సాహిత్యంపై జీవితాంతం కొనసాగే మక్కువగా మారింది. టొరంటో విశ్వవిద్యాలయంలో చదువుకున్న కార్సన్, రెండుసార్లు చదువు మధ్యలో ఆపేసినా చివరకు క్లాసిక్స్‌లో బిఎ, ఎంపి తదుపరి పిహెచ్డి పూర్తి చేసింది. అనంతరం, అమెరికా, కెనడాల్లోని అనేక విశ్వవిద్యాలయాల్లో, బోధనా విభాగంలో పని చేసింది. మెక్‌గిల్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో ఆమె అధ్యాపకురాలిగా సేవలు అందించింది. 1986లో వెలువడిన ‘ఎరోస్ ది బిట్టర్‌స్వీట్: యాన్ ఎస్సే’ ఆమె సాహిత్య జీవితానికి బలమైన ప్రారంభం. ప్రేమ, ఆకర్షణ, దూరం వంటి భావాలను ప్రాచీన గ్రీకు సాహిత్యంతో అనుసంధానిస్తూ ఆమె రాసిన ఈ గ్రంథం, కార్సన్ ప్రత్యేకమైన రచనా శైలికి పునాది వేసింది. ఆమె తర్వాతి రచనలు ‘గ్లాస్, ఐరనీ అండ్ గాడ్’, ‘ప్లెయిన్ వాటర్’, ‘మెన్ ఇన్ ది ఆఫ్ అవర్స్’ ఆమెను సమకాలీన కవిత్వంలో ఎవరికీ సరితూగని స్వరంగా నిలబెట్టాయి. అయితే కార్సన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రచనల్లో ‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్’ ఒకటి. 1998లో వెలువడిన ఈ కవితాత్మక గ్రంథం ప్రాచీన గ్రీకు పురాణాన్ని ఆధునిక జీవితంలోకి తీసుకొచ్చింది. హెరాక్లెస్ పది కార్యాల్లో ఒకటైన ఎర్రని రెక్కల రాక్షసుడు గెర్యాన్ను సంహరించే కథను కార్సన్ పూర్తిగా కొత్త కోణంలో పునర్నిర్మించింది. పురాణంలో హెరాక్లెస్ గెర్యాన్ను చంపి అతని ఎర్ర పశువులను దోచుకుంటాడు. కార్సన్ రచనలో మాత్రం కథ శరీర హింస నుంచి భావోద్వేగ హింస వైపు మళ్లుతుందిహెరాక్లెస్ గెర్యాన్ హృదయాన్ని, అతని అమాయకత్వాన్ని దోచుకుంటాడు. ఇద్దరూ కౌమార దశలో కలుసుకుంటారు. రెక్కలతో, ఎర్రని శరీరంతో ఉండే సున్నితమైన గెర్యాన్కు విరుద్ధంగా హెరాక్లెస్ తిరుగుబాటు స్వభావం కలిగిన ఆకర్షణీయ యువకుడు. వారి ప్రేమ చివరకు గెర్యాన్కు తీవ్రమైన హృదయవేదనగా మారుతుంది. కొన్నేళ్ల తరువాత బ్యూనస్ ఎయిర్స్లో వారి పునఃసందర్శనం కథను మరో సంక్లిష్టమైన దిశలోకి తీసుకెళ్తుంది. ప్రేమ, అసూయ, ఆకాంక్ష, స్వాధీనతమానవ సంబంధాల్లోని అంతర్గత సంఘర్షణలను కార్సన్ పురాణపు ప్రతీకలతో మేళవించింది. విమర్శకుడు బ్రూస్ హైన్లీ ఆమెను ‘హృదయవేదనకు తాత్వికురాలు’గా అభివర్ణించడం ఈ రచన స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘కవిత్వం అంటే తప్పనిసరిగా ఛందస్సు, ప్రాస, నిర్దిష్ట పంక్తి నిర్మాణం ఉండాలి’ అనే సంప్రదాయ భావనను ఆమె ప్రశ్నించడం ప్రశ్నించడం కార్సన్ రచనల్లో కనిపించే మరో ముఖ్యమైన లక్షణం.‘ఆటోబయోగ్రఫీ ఆఫ్ రెడ్’ను కవితా నవలగా పిలిచినా, దాని భాష గద్యానికి దగ్గరగా ఉంటుందని కొందరు విమర్శకులు అభిప్రాయపడ్డారు. అయితే అదే అస్పష్టత కార్సన్ సాహిత్య ప్రయోగానికి కేంద్రబిందువుగా మారింది. ఆమెకు ప్రక్రియ కంటే భావం, రూపం కంటే అనుభవం ముఖ్యం. 2001లో వచ్చిన ‘మెన్ ఇన్ ది ఆఫీస్ అవర్స్’ కాలం, జీవితం, లైంగికత, ప్రేమ, మరణం వంటి అంశాలను విభిన్న రూపాల్లో పరిశీలించింది. ఎపిటాఫ్‌లు, ప్రేమకవితలు, వ్యాసాత్మక కవితలు, జ్ఞాపక గద్యాలు, చిత్రాలను ఉద్దేశించి రాసిన కవితలుఅన్నీ ఒకే పుస్తకంలో సహజీవనం చేశాయి. అదే ఏడాది వెలువడిన ‘ది బ్యూటీ ఆఫ్ ది హస్బెండ్’ వివాహ బంధం విచ్ఛిన్నమవుతున్న సందర్భంలో కోరిక, ద్రోహం, దాంపత్య విరక్తిని పరిశీలించింది. 29 ‘టాంగోలు’గా నిర్మించిన ఈ రచనకు ప్రతిష్ఠాత్మక టిఎస్ ఇలియట్ అవార్డు లభించింది. 2005లో వచ్చిన ‘డిక్రియేషన్’లో కార్సన్ సాహిత్యం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతలను మరింత దగ్గర చేసింది. తత్వవేత్త సిమోన్ వెయిల్ ఆలోచనల నుంచి తీసుకున్న ‘డీక్రియేషన్’ భావనమనలోని ‘నేను’ను కరిగించి, స్వీయకేంద్రిత అస్తిత్వాన్ని అధిగమించడంఈ రచనకు ఆధారం. విమర్శకుల దృష్టిలో ఇది సమకాలీన సాహిత్యంలో అత్యంత ప్రత్యేకమైన మేధస్సు పనిచేస్తున్న తీరుకు ఉదాహరణ. ప్రాచీన గ్రీకు నాటకాల అనువాదకురాలిగా కూడా కార్సన్ తన ప్రత్యేకతను చాటుకుంది. ‘గ్రీఫ్ లెస్సెన్స్’లో యూరిపిడిస్కు చెందిన నాలుగు విషాద నాటకాలను ఆమె కొత్త భాషలో పరిచయం చేసింది. 2009లో వెలువడిన ‘యాన్ అరెస్టియా’లో, ‘అగమెమ్నన్’ (ఎస్కిలస్), ‘ఎలెక్ట్రా’ (సోఫోక్లిస్), ‘అరెస్టెస్’ (యూరిపిడిస్) గ్రంథాలను ఒకే సమాహారంగా మలిచింది. ఈ అనువాదాల్లో ఆమె స్వేచ్ఛా ప్రయోగాలు కొంత విమర్శకు గురైనప్పటికీ, ప్రాచీన నాటకాలను ఆధునిక పాఠకుడికి చేరువ చేయడంలో ఆమె ప్రయత్నం విశేషమైనది. కార్సన్‌కు గుగ్గెన్హైమ్ ఫౌండేషన్, మాక్ ఆర్థర్ ఫౌండేషన అమెరికన్ అకాడెమీ ఇన్ బెర్లిన్ వంటి సంస్థల ఫెలోషిప్‌లు లభించాయి. లానన్ లిటరరీ అవార్డు, పుష్కార్ట్ ప్రైజ్, గ్రిఫిన్ పోయెట్రీ ప్రైజ్ వంటి అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘నాక్స్’, ‘రెడ్డాక్’, ‘ఫ్లోట్’ వంటి రచనలను కూడా ఆమె సాహిత్య ప్రయోగాలకు కొనసాగింపుగానే చూడాలి. తాజాగా నోబెల్ బహుమతి లభించడం ఆమె కీర్తి కిరీటంలో మరో కలికితురాయి. అయితే కార్సన్‌ను అర్థం చేసుకోవడానికి ఆమె పురస్కారాల జాబితా సరిపోదు. ఒకసారి కవి-విమర్శకురాలు స్టెఫానీ బర్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనను తాను మాటల కంటే దృశ్యాలను ఇష్టపడే కళాకారిణిగా కార్సన్ పేర్కొంది. చిన్నతనంలో తాను ఎక్కువగా చిత్రాలు గీసేదాన్నని, తనను తాను రచయిత్రిగా ఎప్పుడూ ఊహించుకోలేదని ఆమె చెప్పడం విశేషం. బహుశా ఇదే కార్సన్ సాహిత్య రహస్యం. రచన అనేది ఆమెకు ఆలోచనలను, అనుభవాలను, చిత్రాలను, భాషను ఒకచోట ఉంచే ఒక సాధనం. కవిత్వం ఎక్కడ ముగుస్తుంది? గద్యం ఎక్కడ మొదలవుతుంది? పురాణం ఎక్కడ ముగిసి, ఆధునిక జీవితం ఎక్కడ ప్రారంభమవుతుంది? ప్రేమ ఎప్పుడు ఆనందం నుంచి బాధగా మారుతుంది? వ్యక్తి తన ‘నేను’ను దాటి వెళ్లగలడా? వంటి అనేకానేక ప్రశ్నలను ఒకవైపు సంధిస్తూనే, ఆమె రచనలు సులభమైన సమాధానాలను మాత్రం ఇవ్వవు. బదులుగా, ఆ ప్రశ్నలతోనే పాఠకుడిని ఒంటరిగా వదిలేస్తాయి. అదే ఆమె సాహిత్య శక్తి. ఇప్పటి ప్రపంచ సాహిత్యంలో ప్రక్రియల సరిహద్దులు వేగంగా చెదిరిపోతున్న తరుణంలో కార్సన్ రచనలు మరింత ప్రాసంగికతను సంతరించుకున్నాయి. సాహిత్యానికి నిర్వచనాలు అవసరం కావచ్చుగానీ, గొప్ప సాహిత్యానికి సరిహద్దులు అవసరం లేదని ఆమె రచనలు స్పష్టం చేస్తున్నాయి.