Skip to content
జాతీయం వార్తలు

IMD Weather Alert: ఏపీలో వచ్చే మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. దేశవ్యాప్తంగా వారం పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Prajapaksham 10 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
IMD Weather Alert: ఏపీలో వచ్చే మూడుగంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. దేశవ్యాప్తంగా వారం పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..

Today Weather

IMD Weather Alert: దేశంలో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా రానున్న ఏడు రోజుల పాటు, అంటే ఆగస్టు 10 నుండి 16 వరకు పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, తీవ్రమైన మెరుపులు, ఉరుములతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. వర్షాల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐఎండీ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. రాగల మూడు గంటల్లో అనేక ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. అదే సమయంలో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రమాదకర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద గానీ.. భారీ హోర్డింగుల వద్ద గానీ నిలబడకూడదని అధికారులు స్పష్టం చేశారు.

ఉత్తర భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో ఆగస్టు 10 నుండి వర్షాలు తీవ్రతరం కానున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ఆగస్టు 10 నుండి 16 వరకు వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. ఢిల్లీ ఎన్‌సిఆర్, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఆగస్టు 10, 11, 13 తేదీలలో వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో ఆగస్టు 14న, తూర్పు రాజస్థాన్‌లో ఆగస్టు 10 నుండి 12 వరకు వర్షాలు కురుస్తాయని తెలిపారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 10-12 మధ్య, తూర్పు మధ్యప్రదేశ్‌లో ఆగస్టు 10-16 వరకు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. విదర్భలో ఆగస్టు 13, 14 తేదీల్లో మరియు ఛత్తీస్‌గఢ్‌లో ఆగస్టు 10తో పాటు 13 నుండి 16 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.

తూర్పు, ఈశాన్య భారతంలోనూ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. అండమాన్ నికోబార్ దీవులు, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆగస్టు 10 నుండి 16 వరకు అక్కడక్కడ వర్షాలు పడతాయి. జార్ఖండ్‌లో ఆగస్టు 10 నుండి 16 వరకు, బీహార్‌లో ఆగస్టు 10 నుండి 16 వరకు పలు విడతలుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో ఆగస్టు 10 నుండి 16 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని వివరించారు.

పశ్చిమ భారతదేశంలో కొంకణ్, గోవా ప్రాంతాల్లో ఆగస్టు 10 నుండి 16 వరకు, గుజరాత్‌లో ఆగస్టు 10-13 అలాగే 14-16 మధ్య వర్షాలు కురుస్తాయి. మధ్య మహారాష్ట్ర, మరాఠ్వాడ, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో కూడా ఈ వారం రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని, ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.