Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

AP Debts: ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్రం కీలక ప్రకటన.. రూ. 6.45 లక్షల కోట్లకు చేరిన రుణాలు..

Prajapaksham 29 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP Debts: ఆంధ్రప్రదేశ్ అప్పులపై కేంద్రం కీలక ప్రకటన.. రూ. 6.45 లక్షల కోట్లకు చేరిన రుణాలు..

Andhra Pradesh Govt ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు

AP Debts: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న అప్పులు, కీలకమైన పోర్టుల అభివృద్ధి పురోగతిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా కీలక వివరాలను వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ వివేక్ ఠంకా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇస్తూ.. 2026 బడ్జెట్ అంచనాల ప్రకారం రాష్ట్ర అప్పు ఏకంగా రూ.6,45,461 కోట్లకు చేరినట్లు తెలిపారు.

గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర అప్పులు వరుసగా పెరుగుతూ వస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2024లో రూ.4,92,568 కోట్లుగా ఉన్న అప్పు.. 2025 నాటికి రూ.5,65,534 కోట్లకు చేరింది. అంటే 2024 నుండి 2025 మధ్య అప్పుల్లో 14.81 శాతం పెరుగుదల నమోదు కాగా.. 2025 నుండి 2026 నాటికి అది మరో 14.13 శాతం మేర పెరిగి ప్రస్తుత స్థాయికి చేరుకుందని కేంద్రం స్పష్టం చేసింది.

అప్పుల భారంతో పాటు రాష్ట్ర ఆర్థిక పురోగతికి సంబంధించిన ఇతర ఆశాజనక గణాంకాలను కూడా కేంద్రం తన నివేదికలో పొందుపరిచింది. ఒకవైపు అప్పులు పెరుగుతున్నప్పటికీ.. మరోవైపు రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు, తలసరి ఆదాయంలోనూ ప్రగతి కనిపిస్తోందని తెలిపింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.14.23 లక్షల కోట్లుగా ఉండగా.. 2025-26 నాటికి అది రూ.17.62 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా 2023-24లో నమోదైన రూ.2.39 లక్షల నుంచి 2025-26 నాటికి రూ.2.94 లక్షలకు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది.

దీంతోపాటు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, ముఖ్యంగా పోర్టుల అభివృద్ధికి సంబంధించి కూడా పార్లమెంటులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టుల శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణం ఇప్పటివరకు 80.55 శాతం పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ దశను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అంతేకాకుండా, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద రూ.45 కోట్ల వ్యయంతో అటానమస్ మారిటైం షిప్‌యార్డ్, సిస్టమ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాయని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే స్థానికంగా దాదాపు 750 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్రం అంచనా వేసింది.