AP Mega DSC Row: నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. ఏపీ మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి.. సీబీఐ విచారణ చేయించాలంటూ వైసీపీ ఆందోళన..
Nara Lokesh and YSRCP Protest
AP Mega DSC Row: డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన ఈ నియామకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)చే విచారణ జరిపించాలని.. ఈ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ పలు కీలక అంశాలను లేవనెత్తింది. గత రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 5.5 లక్షలకు పైగా తగ్గిందని, ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడులకు మారారన్న ప్రభుత్వ వాదన ముమ్మాటికీ తప్పుదోవ పట్టించడమేనని ఆరోపించింది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా పాఠ్యపుస్తకాలు అందలేదని, విద్యా కానుక పథకం అమలు కాలేదని విమర్శించింది. అలాగే తల్లికి వందనం పథకం లబ్ధిదారుల జాబితా నుంచి 22.6 లక్షల మందిని తొలగించారని ఆందోళన వ్యక్తం చేసింది.
దీంతో పాటు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయాలని, వసతి దీవెన పథకాన్ని పునరుద్ధరించాలని, నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యను, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికే ఈ నిరసనలు చేపడుతున్నామని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు.