Skip to content
ప్రపంచం వార్తలు

Donald Trump: హార్ముజ్ జలసంధిపై ట్రంప్ యూ-టర్న్.. 20% టోల్ ప్రతిపాదన వెనక్కి.. కారణం ఏంటంటే..

Prajapaksham 15 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Donald Trump: హార్ముజ్ జలసంధిపై ట్రంప్ యూ-టర్న్.. 20% టోల్ ప్రతిపాదన వెనక్కి.. కారణం ఏంటంటే..

US-Venezuela oil deal: వెనుజులా ఆయిల్ వ్యాపారంలోకి అమెరికా...మీకు మూరెడు...మాకు బారెడు : చమురు వ్యాపారంలో పెంటగాన్‌కు 35% వాటా..?

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేవలం 24 గంటల వ్యవధిలోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. హార్ముజ్ జలసంధిపై ప్రతిపాదించిన 20 శాతం రక్షణ సుంకాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయ దౌత్యంలో తాజాగా కీలక మలుపుగా మారింది. సోమవారం నాడు తానే స్వయంగా అమెరికాను.. హార్ముజ్ జలసంధి సంరక్షకుడుగా అభివర్ణిస్తూ.. ఈ మార్గం గుండా వెళ్లే సరుకుల విలువలపై 20 శాతం రీఇంబర్స్‌మెంట్ రుసుము విధిస్తామని ప్రకటించారు.

జలసంధి భద్రత కోసం అమెరికా చేసే భారీ ఖర్చును ఇతర దేశాల నుంచి రాబట్టేందుకే ఈ చర్య అని ట్రంప్ సమర్థించుకున్నప్పటికీ.. ఈ నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని, ఇంధన విపణిని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ప్రతిపాదన వెలువడిన వెంటనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా దూసుకుపోవడంతో పాటు.. అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు, గల్ఫ్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో.. గల్ఫ్ దేశాల రాజులు, అమీర్లు, ఇతర అరబ్ దేశాల నేతలతో జరిపిన అత్యవసర దౌత్య చర్చల అనంతరం ట్రంప్ తన పంతాన్ని వీడక తప్పలేదు. సుంకం ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. దానికి బదులుగా గల్ఫ్ దేశాల నుంచి అమెరికాలోకి భారీ ఎత్తున పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాలు రానున్నట్లు వెల్లడించారు. ఈ భారీ ఒప్పందాల ద్వారా అమెరికాలో తయారీ రంగానికి కొత్త ఊపు వస్తుందని.. లక్షలాది మంది అమెరికన్లకు అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం నౌకాయాన స్వేచ్ఛ గల అంతర్జాతీయ జలమార్గాలపై బలవంతంగా సుంకాలు విధించడం చట్టవిరుద్ధమని ఐక్యరాజ్యసమితి సైతం హెచ్చరించడంతో.. ట్రంప్ తన మునుపటి దూకుడు నిర్ణయం నుండి ఆర్థిక దౌత్యం వైపునకు మొగ్గు చూపారు.

అయితే రక్షణ సుంకం విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నప్పటికీ.. ఇరాన్‌పై అమెరికా ప్రకటించిన ఆంక్షలు, దిగ్బంధనం మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఇరాన్ ఓడరేవుల నుండి వచ్చే.. అక్కడికి వెళ్లే నౌకలపై అమెరికా నౌకాదళం పూర్తి స్థాయి నావికా దిగ్బంధనాన్ని అమలు చేస్తూనే ఉంది. దీనివల్ల హార్ముజ్ జలసంధి చుట్టూ ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదు. అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలకు భద్రత కల్పిస్తూనే.. మరోవైపు ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సైన్యం సరిహద్దుల్లో మోహరించింది.

ట్యాగ్‌లు: Donald Trump Strait of Hormuz