Skip to content
సంపాదకీయం వార్తలు

బొద్దింకలు విప్లవకారులా?

Prajapaksham 14 Jun 2026 1 నిమిషాల పఠనం సంపాదకీయం
బొద్దింకలు విప్లవకారులా?

Are ‘Cockroaches’ Revolutionaries? Remark Sparks Political Debate

కాక్రోచ్ (బొద్దింక) జనతాపార్టీ (సిజెపి) అతివేగంగా వృద్ధి చెందుతున్న ఉద్యమం. అయితే అది ప్రచారం చేసుకుంటున్నట్లు నిజంగా అది యువజన ఉద్యమమా లేక కేవలం సోషల్ మీడియా లక్షణమా, ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. మనం గనుక దాన్ని న్యాయబద్ధమైన యువత ఉద్యమంగా పరిగణిస్తే దాన్ని కచ్చితంగా కొన్ని ప్రశ్నలు అడగటం, దాని భావజాలాన్ని విశ్లేషించటం అవసరం. దాని ప్రమోటర్స్ అత్యధికులు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఈ యువత ఉద్యమం ఎక్కడ వెనుకబడుతున్నదో కొన్ని అంశాలు పరిశీలించుదాం.
ఒక ఉద్యమం నిజాయితీ గూర్చి ముందుగా, ముఖ్యంగా తెలుసుకోవలసింది దాని భావజాలం లేదా సిద్ధాంతం. సిజెపి ఇప్పటివరకు దాని భావజాలమేమిటో వివరించలేదు. ఈ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు లోగడ ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధాలున్నాయి. ఆ రోజుల్లో ఆప్ కూడా చిత్రంగా ప్రసిద్ధిపొందింది. ఆనాడు అదీ యువజనోద్యమమే. అది కూడా ఈనాటివరకు దాని భావజాలమేమిటో వెల్లడించలేదు. అయితే అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఆప్ అవినీతిలో మునగటాన్ని పంజాబ్ అసెంబ్లీలో ప్రతి ఒక్కరు చూశారు. ఆప్ తన ప్రచారంలో ఎల్లప్పుడూ ‘విప్లవం’ అనే మాట ఉపయోగిస్తుంది. అయితే దాన్ని అది అర్థం చేసుకోలేదు. “సెక్యులర్, సోషలిస్టు, డెమొక్రటిక్, లేజీ (సోమరితనం)” సిజెపి ధ్యేయంగా ప్రతిచోట ప్రచారంలో పెట్టబడుతున్నది. దాని అధికారిక సైట్, సోషల్ మీడియా హాండిల్స్, ఆ సంస్థ ప్రణాళికలో ఈ మాటలు ఒక్కసారి కూడా రాయబడలేదు. భావజాల సంక్షోభం విస్మరించవీలులేనిది. అతిపెద్ద రాజకీయ పార్టీ తన ఫాసిస్టు భావజాలానికి నిబద్ధమై ఉన్నప్పుడు, స్పష్టమైన భావజాలం లేని సంస్థ దానికి ప్రత్యామ్నాయం కాజాలదు.
సిజెపి భారత యువతకు ప్రాతినిధ్యం వహిస్తోందని అనుకోవటం భ్రమ. వాస్తవం ఏమంటే అది పట్టణ యువతకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మిగతా యువతతో, ఇతర సాధారణ ప్రజలతో దానికి సంబంధం లేదు. దాని అధికారిక సైట్ సభ్యత్వం పొందటానికి అర్హత విభాగంలో అది ఏమి చెప్పిందంటే, ‘నిరుద్యోగులు, సోమరిపోతులు, నిరంతరం ఆన్ ఉండేవారు, వృత్తిపరంగా వాగాడంబరులు’ అర్హులని చెప్పింది. పట్టణ మధ్యతరగతులకు మాత్రమే ఈ సౌకర్యం ఉంటుంది. ఈ సంస్థకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో లేక ఎవరికి ఈ సంస్థ ప్రాతినిధ్యం వహిస్తున్నదో ఇది తెలియజేస్తున్నది. ఇటీవల బిజెపి లో చేరిన ఆప్ మాజీ ఎంపి రాఘవ చెద్దాను తీసుకుందాం. ఆయన ఎప్పుడూ తనను యువజన నాయకునిగా చెప్పుకునేవాడు, ఆయనకు అత్యంత యువ ఎంపి టైటిల్ ఉంది. ఆయన కూడా మధ్యతరగతులకే ప్రాతినిధ్యం వహించారు, ఆ తరగతే ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. సిజెపికి ఏ భావజాలంతోనూ సంబంధం లేదంటే అతిపెద్ద వర్గపోరాట సమస్యల్లో దానికి ఆసక్తిలేదని తెలుస్తున్నది. రాజకీయాలను వర్గ పోరాటం నుంచి వేరుచేయ వీలులేదు. ఒక సంస్థ కార్మికవర్గం పట్ల నిబద్ధత చూపటం లేదంటే, అది పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలతో కలిసినట్లు నిశ్శబ్ద సంకేతం.
యావత్ సోషల్ మీడియా కాక్రోచ్ జనతాపార్టీని విప్లవ సంస్థగా పరిగణిస్తున్నది. అయితే ఎవరైనా విప్లవకారుడా, కాదా అని పరిశీలించటానికి సోషల్ మీడియా వ్యాఖ్యలు కొలమానం కాదు. మనం సిజెపి ప్రణాళికను పరిశీలించినట్లయితే అందులోని ఐదు అంశాలు అత్యంత ఇటీవలి సమస్యలకు ప్రతి స్పందనగా మనం చూస్తాం. ఒకటి పదవీ విరమణానంతర బహుమతిగా ఏ ప్రధాన న్యాయమూర్తికీ రాజ్యసభ సీటు ఇవ్వరాదు. ఇది ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ యువతపై చేసిన వ్యాఖ్య, ఇతర జడ్జీల ఇతర వ్యాఖ్యలకు ప్రతి స్పందన అనేది స్పష్టం అవుతూంది. రెండు, న్యాయబద్ధమైన ఓటర్లను తొలగించినందుకు సిఇసిని ఉపా కింద అరెస్టు చేయాలి. ఇది ఇటీవలి ఓటరు జాబితాల ప్రక్షాళన (సర్) సమస్యలు , పశ్చిమ బెంగాల్ న్యాయబద్ధమైన ఓటర్ల తొలగింపునకు ప్రతిస్పందన అనేది స్పష్టం . మూడు, పార్లమెంట్ సీట్లు పెంచకుండా మహిళలకు 50శాతం రిజర్వేషన్ , అన్ని మంత్రి పదవుల్లో అదనంగా 50శాతం రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది ఇటీవలి డీ లిమిటేషన్ బిల్లుకు స్పందన. నాలుగు, అంబానీ , అదానీ యజమానులుగా ఉన్న మీడియా సంస్థలన్నింటి లైసెన్సుల రద్దు చేయాలి. పత్రికా స్వేచ్ఛ విషయంలో అంతర్జాతీయంగా దిగజారిన మన ర్యాంకింగ్ స్పందన. ఐదు, ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఫిరాయించిన ఏ ఎమ్మెల్యే లేదా ఎంపి 20ఏళ్ల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా, ఏ ప్రభుత్వ పదవీ చేపట్టకుండా నిషేధం. ఇది రాఘవ చెద్దా బిజెపిలో చేరటం పట్ల ప్రతి స్పందన.
సిజెపి ప్రణాళికలోని ఈ పాయింట్లన్నీ నిస్సందేహంగా న్యాయమైనవి, సమకాలీన రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైనవి. అయితే ఏదో కనిపించటం లేదు. అది రైతుల సమస్యలు, ఫ్యాక్టరీ కార్మికుల సమస్య లు, ఆదాయంలో అసమానత, మణిపూర్ సంక్షోభం, ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటీకరిస్తున్న సమస్య, దారుణంగా ఉన్న ప్రజారోగ్య పరిస్థితులు స్థానం పొందక పోవటం. ఈ సంస్థ సోషల్ మీడియాలో హైలైట్ అయిన ఇటీవలి సమస్యల గూర్చి ఆందోళన చెందుతోందని తెలుస్తోంది. యువత ప్రాధమిక హక్కులు అయిన నాణ్యమైన ప్రభుత్వ విద్య అందుబాటు, సమాన సౌకర్యాలు, ఉద్యోగం గూర్చి అది అసలు మాట్లాడను కూడా లేదు. ఇవి అభివృద్ధి నిరోధకుల సంకేతాలు తప్ప విప్లవాదుల సంకేతం కాదు.
అది జన్-జడ్ ఉద్యమంగా వృద్ధి చెందుతుందా? కావచ్చు , కాకపోవచ్చు. నేపాల్ అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసిన జన్ ఉద్యమంలాగా సిజెపి ఆ పని చేయలేదు. భారతదేశంలోని బిజెపి ప్రభుత్వం స్వభావం రీత్యా ఫాసిస్టు , ప్రజల్లో , సిద్ధాంతంలో వేళ్లూనని ఏ ఉద్యమాన్నయినా అణచివేయగల రాజ్య ఆయుధాలను అది పటిష్టం చేసుకుంది. సిజెపి ఇప్పటివరకు ప్రజలతో ,వారి ఉదమాలతో సంబంధంలేని సోషల్ మీడియా ఉద్యమం. దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఇటీవల ట్రేడ్ యూనియన్ ఆందోళనతో దానికి సంబంధం ఉందా? అది భారత ప్రభుత్వానికి పెద్ద సవాలు కాదు. నేపాల్ కూడా రాజకీయ ప్రభుత్వమే మారింది, విధానాలన్నీ దాదాపుగా అదే విధంగా ఉన్నాయి. ప్రగతి శీలుడని చెప్పుకుంటున్న నేపాల్ ప్రధాని సైతం విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనేందుకు విద్యార్థులకు గల ప్రాథమిక హక్కును రద్దు చేశాడు. తిరుగుబాటు ఎప్పుడూ విప్లవం కాజాలదనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
ఈ మితవాద రాజకీయాలకు ప్రత్యామ్నాయం మనకు దాదాపు నూరేళ్ల క్రితమే ఉంది. అది భగత్ సింగ్ , చంద్రశేఖర్ ఆజాద్ తదితర జాతీయ విప్లవకారులను ఉత్తేజపరచిన సోషలిజం. భారతదేశంలో ప్రస్తుత ఫాసిస్టు దిగజారుడుకు, ప్రపంచ సామ్రాజ్యవాద సంక్షోభానికి అదొక్కటే ప్రత్యామ్నాయం, పరిష్కారం. అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్, యూత్ ఫెడరేషన్ వంటి సంస్థలు సోషలిజం అనే ఉమ్మడి భావజాలం కింద దశాబ్దాలుగా విద్యార్థులను సంఘటిత పరుస్తున్నాయి. సిజెపి తన ప్రణాళికలో కనీసం ప్రస్తావించని అందరికీ నాణ్యమైన విద్య, ఉపాధి సమస్యలపై అవి పనిచేస్తున్నాయి.
ప్రభుత్వ విద్యను కాపాడేందుకు, బనేగా (భగత్ సింగ్ జాతీయ ఉపాధిహామీ చట్టం) కోసం పోరాడుతున్నాయి. యువజన రాజకీయాలను సమాజంలోని ఇతర అంశాలనుంచి వేరుచేసి చూడలేము. విప్లవానికి క్షేత్ర స్థాయిలో సంస్థాగత నిర్మాణం అవసరం. సిజెసి వంటి ధోరణులతో సమస్య ఏమంటే, అవి మధ్య తరగతి ప్రజలకు ఏదో సాధించామన్న భావన కలుగజేస్తాయి; వాస్తవికమైన పోరాటాలకు వారిని దూరంగా ఉంచుతాయి. ఒక నిర్ధిష్టమైన వెబ్ పేజీని అనుసరించటం లేక ఒక రీల్ షేర్ చేయటం ద్వారా రాజకీయం గా సంతృప్తి చెందినట్లు ప్రజలు భావించవచ్చు. అయితే దానికి సామాజిక ప్రాముఖ్యత ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *