డికె శివకుమార్ అనే నేను వెనుక దాగిన కన్నీటి చరిత్ర.. ఎన్నో కష్టాలు..మరోన్నో అవమానాలు..
D.K. Shivakumar Sworn In as Karnataka's 25th Chief Minister, Marks New Political Era
కర్ణాటక రాజకీయాల్లో “కనకపుర బండ”గా, కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా నిలిచిన నాయకుడు డీకే శివకుమార్ (DKS). ఆయన రాజకీయ ప్రస్థానం కేవలం గెలుపోటముల లెక్క కాదు… అపజయం నుంచి అఖండ విజయం వైపు, ఒంటరి పోరాటం నుంచి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే వరకు సాగిన ఒక ఉద్వేగభరిత ప్రయాణం.
బెంగళూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన శివకుమార్, విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పట్లో కర్ణాటక రాజకీయాల్లో దిగ్గజమైన హెచ్.డి. దేవెగౌడను ఎదురించడం అంటే ఎవరూ ఊహించని విషయం. కానీ 1985లో, కేవలం 23 ఏళ్ల వయసులోనే దేవెగౌడ లాంటి బలమైన నాయకుడిపై పోటీకి నిలిచారు శివకుమార్.
తొలి ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన ధైర్యం కోల్పోలేదు. 1989లో అదే దేవెగౌడపై ఘనవిజయం సాధించి, జయకేతనం ఎగురవేశారు. ఆ గెలుపు ఆయనను ఒక సామాన్య కార్యకర్త నుండి ఒక తిరుగులేని శక్తిగా మార్చింది.
డీకే శివకుమార్ అంటే కేవలం తన నియోజకవర్గాన్ని చూసుకునే నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడ సంక్షోభంలో పడినా… “నేనున్నాను” అంటూ ముందుకొచ్చే ట్రబుల్ షూటర్.
2002లో విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు మహారాష్ట్ర ఎమ్మెల్యేలను కాపాడడం,
2017లో గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో అహ్మద్ పటేల్ గెలుపు కోసం సొంత బాధ్యతతో ఎమ్మెల్యేలను సంరక్షించడం.. ఇవన్నీ ఆయనను కాంగ్రెస్ పార్టీకి అపర నమ్మకస్థుడిగా, జాతీయ స్థాయి “ట్రబుల్ షూటర్”గా మార్చాయి. పార్టీ కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకోవడం ఆయన నైజం.
ఆయన రాజకీయ ప్రస్థానంలో అత్యంత ఎమోషనల్, కష్ట కాలం 2019. కేంద్ర దర్యాప్తు సంస్థల కేసుల వల్ల ఆయన తిహార్ జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. 50 రోజులకు పైగా జైలు గోడల మధ్య గడిపిన ఆ రోజులు ఆయనను మానసికంగా ఎంతో కుంగదీశాయి. ముఖ్యంగా, ఆయన కూతురిని కూడా విచారణకు పిలిచినప్పుడు ఒక తండ్రిగా ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
కానీ, జైలు నుంచి విడుదలైన రోజు బెంగళూరు విమానాశ్రయం వెలుపల వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. వర్షంలో తడుస్తూ, కన్నీళ్లతో అభిమానుల వైపు చూస్తూ ఆయన చేసిన ప్రతిజ్ఞ… కర్ణాటక రాజకీయాల్లో ఒక చరిత్ర. నన్ను ఎంతగా తొక్కేయాలని చూస్తే, అంతకంటే బలంగా పైకి లేస్తా అన్న ఆయన కసి ఆ రోజు అందరినీ కదిలించింది.
2020లో కర్ణాటక కాంగ్రెస్ (KPCC) అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పార్టీ దాదాపు కుదేలైంది. కానీ శివకుమార్ విశ్రమించలేదు. రాత్రి పగలు అనకుండా రాష్ట్రమంతా తిరిగారు. కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధించిన రోజు… మీడియా ముందుకు వచ్చిన డీకే శివకుమార్ చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చారు. ఆ కన్నీళ్లలో సోనియా గాంధీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాననే తృప్తి ఉంది, తాను పడిన అవమానాలకు సమాధానం దొరికిందనే ఆనందం ఉంది.
నేను జైల్లో ఉన్నప్పుడు సోనియా గాంధీ నన్ను చూడటానికి వచ్చారు. నేను ఈ రాష్ట్రాన్ని గెలిపించి పార్టీ చేతిలో పెడతానని ఆ రోజే ఆమెకు మాట ఇచ్చాను. ఈ రోజు నా మాట నిలబెట్టుకున్నాను” అని ఆయన గద్గద స్వరంతో చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త హృదయాన్ని తాకాయి.
ఆయన పడిన కష్టానికి, పార్టీ కోసం చేసిన త్యాగాలకు తగిన గుర్తింపు లభించింది. సిద్ధరామయ్య గారి రాజీనామా తర్వాత, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు డీకే శివకుమార్ ఈరోజే (జూన్ 3, 2026న) కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇదొక అత్యంత భావోద్వేగ భరితమైన మరియు చారిత్రాత్మకమైన ఘట్టం.
ఏ జైలు గోడల మధ్యనైతే ఆయనను ఒంటరిని చేయాలని చూశారో, ఏ అవమానాలనైతే ఆయన భరించారో… వాటన్నింటికీ కాలం సమాధానం చెప్పింది. 2023లో డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టి, పార్టీని సమర్థవంతంగా నడిపించిన ఆయన, ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు.
బెంగళూరులోని లోక్ భవన్లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ సమక్షంలో ఆయన కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే… అది కేవలం ఒక పదవీ స్వీకారం కాదు. ఆయన ఇన్నేళ్ల రాజకీయ పోరాటానికి, పట్టుదలకు దక్కిన అసలైన విజయం!
“కనకపుర బండ” అనుకున్నది సాధించింది… ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా ఎదిగిన ఆయన ప్రయాణానికి హ్యాట్సాఫ్.