Skip to content
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ కోసం వచ్చావా? బీజేపీ కోసం వచ్చావా?.. పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
బీఆర్ఎస్ కోసం వచ్చావా? బీజేపీ కోసం వచ్చావా?.. పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Congress MLA Anirudh Reddy Launches Sharp Attack on Pawan Kalyan

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణ మీద చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ వైఖరిని, ఆయన రాజకీయ ఉద్దేశాలను తీవ్రంగా తప్పుబడుతూ హైదరాబాద్‌లోని గాంధీ భవన్ వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కు అమిత్‌షాపై అంతగా ప్రేముంటే వెళ్లి గుజరాత్‌లో పోటీ చేయాలి అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ రాజకీయ ఉనికిని ప్రశ్నిస్తూ అనిరుధ్ రెడ్డి కొన్ని కీలక డిమాండ్లు ముందుంచారు. పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి హైదరాబాద్‌లో ఎన్ని రోజులు ఉంటున్నారు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని రోజులు గడుపుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “నువ్వు అసలు ఏపీలో నిలబడుతావా? లేక తెలంగాణలో నిలబడుతావా? నీ అసలు స్థానం ఎక్కడ?” అని ప్రశ్నించారు. తెలంగాణను ఉద్దేశించి ‘నరదిష్టి’ అని పవన్ మాట్లాడటం వెనుక ఇలాంటి ద్వంద్వ వైఖరి కారణాలే ఉండి ఉంటాయని అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు పవన్‌ను అమరావతిలో కలిశారా, హైదరాబాద్‌లో కలిశారా అని ప్రశ్నించిన ఆయన, తిరుపతికి వెళ్లి హుండీలో వేసిన డబ్బుల గురించి కూడా ఎవరైనా ఈ విధంగా గొప్పగా చెప్పుకుంటారా అని మండిపడ్డారు.

పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ తీరును విమర్శిస్తూ.. ఇదంతా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ అని అనిరుధ్ రెడ్డి కొట్టిపారేశారు. ప్రెస్ మీట్‌లో పవన్ మాట్లాడిన మాటలన్నీ దర్శకుడు త్రివిక్రమ్ రాసిన సినిమా డైలాగులని, ఆ డైలాగులను పవన్ వచ్చి ఇక్కడ చదివాడని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ ఎవరి కోసం ఇక్కడికి వచ్చాడో చెప్పాలని నిలదీశారు. “నువ్వు బీఆర్ఎస్ కోసం వచ్చావా? లేక బీజేపీ కోసం వచ్చావా? ప్రొడ్యూసర్లు ఎవరు ఎక్కువ ప్యాకేజీ ఇస్తే వాళ్ల దగ్గరికే పవన్ కల్యాణ్ వెళ్తారు” అని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా, దేశంలో నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లపై పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్ సినిమా కెరీర్‌ను, రాజకీయాలను ముడిపెడుతూ అనిరుధ్ రెడ్డి మరికొన్ని ఘాటు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాప్ అయ్యాయని.. ఆ సినిమాల పరాజయాల తాలూకు తీవ్రమైన డిప్రెషన్ లోనే పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఈ విధమైన అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో పాటు పట్టా శిఖం భూములను డిస్టర్బ్ చేయొద్దంటూ భూముల అంశంపై కూడా ఆయన స్పందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *