Skip to content
తెలంగాణ వార్తలు

జూబ్లీహిల్స్‌లో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద హై టెన్షన్ డ్రామా.. అసలేం ఏం జరిగింది?

Prajapaksham 02 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
జూబ్లీహిల్స్‌లో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద హై టెన్షన్ డ్రామా.. అసలేం ఏం జరిగింది?

High Drama at Pawan Kalyan’s Hyderabad Home: What Triggered the Tension?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూబ్లీహిల్స్ నివాసం వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో, పవన్ కల్యాణ్ తన ఇంటి వద్దే ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ సమాచారం తెలుసుకున్న పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకోవడంతో, అక్కడ భద్రత కోసం పోలీసులు భారీగా మోహరించి వారిని అడ్డుకున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. సుమారు 2 వేల మంది ప్రతినిధులతో నిర్వహించే ఈ ఇండోర్ సమావేశానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలని పార్టీ నాయకత్వం పోలీసులను కోరింది.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సభ వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అలాగే ట్రాఫిక్ అంతరాయం మరియు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల బందోబస్తు తదితర కారణాలను చూపుతూ సైబరాబాద్ పోలీసులు ఈ సభకు అనుమతిని పూర్తిగా నిరాకరించారు. పోలీసుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ జనసేన పార్టీ అత్యవసరంగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా చుక్కెదురైంది. మంగళవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం జనసేన వాదనలతో ఏకీభవించకుండా పిటిషన్‌ను కొట్టివేసింది.

న్యాయస్థానంలోనూ నిరాశే ఎదురవడంతో పవన్ కళ్యాణ్ తన నివాసం నుంచే సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య మీడియా ప్రతినిధులతో, పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా వేగంగా వ్యాపించడంతో ఉత్సాహంతో అభిమానులు, కార్యకర్తలు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి పోటెత్తారు. పరిస్థితి చేయి దాటకుండా పోలీసులు వారిని అక్కడికక్కడే నిలువరించడంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *