ప్రజాపక్షం/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ సమీపంలో అవుటర్ రింగు రోడ్డుపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన కూలీలు వెళ్తున్న బొలేరో ట్రక్ ను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో డ్రైవర్ కూడా వున్నారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, మరొక మహిళ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాద సమయంలో ట్రక్ లో సుమారుల 30 మంది కూలీలు ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదానికి కారణమైన లారీ గుజరాత్ కి చెందినదిగా గుర్తించారు. కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మామిడికాయలు తీసుకెళుతున్నట్లు పోలీసులు వివరించారు. కరోనా ప్రభావంతో పనులు లేక వీరంతా తమ సొంతగ్రామం రాయచూర్ కి ట్రక్ లో బయల్దేరారు. కానీ మృత్యువు వీరిని వెంటాడింది. పెద్ద గోల్కొండ సమీపానికి రాగానే లారీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న ఓఆర్ఆర్ సిబ్బంది మృత దేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ఓ చిన్నారి, బాలిక ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కూలీలను కబళించిన మృత్యువు
RELATED ARTICLES