ఆలయం మూసివేత, శుద్ధి అనంతరం తెరుచుకున్న ఆలయం
శబరిమల: కేరళ శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం ఉదయం 50ఏళ్లలోపు ఇద్దరు మహిళలు దర్శించుకున్నారు. దీంతో తీవ్ర దుమారం చెలరేగింది. కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళలు బుధవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము ఆలయంలోకి ప్రవేశించి అయ్యప్పను దర్శించుకున్నట్లు తెలిపారు. అనంతరం ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ప్రధాన అర్చకుడి ఆదేశాలతో బుధవారం ఉదయం దాదాపు గంట పాటు ఆలయ ద్వారాలను మూసి శుద్ధి చేశారు. అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచి భక్తుల దర్శనానికి వీలు కల్పించారు. మహిళలు ఆలయాన్ని దర్శించుకున్న విషయం తెలియగానే శబరిమల ఆలయ నిర్వాహకులు అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఆలయాన్ని శుద్ధి చేయాలని ప్రధాన అర్చకుడు ఆదేశించారు. దీంతో ద్వారాలను మూసివేసి సంప్రోక్షణ చేపట్టారు. తాజా ఘటనపై పండలం రాజకుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా.. మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్రువీకరించారు. అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు వచ్చే మహిళలకు మరింత భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించామని పినరయి తెలిపారు.