న్యూఢిల్లీ: భారత భావి రాష్ట్రపతి ఎవరు? ఉన్న పళాన ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ ఉండటం, ఇటీవలి పలు రాష్రాలో బిజెపి అధికారంలోకి రావడం, తద్వారా రాజ్యసభలోనూ బిజెపి-ఎన్‌డిఎ కూటమికి బలం పెరగడంతో సాధారణంగా ఎన్‌డిఎ నిలబెట్టే వ్యక్తే రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశాలు సుస్పష్టం. అయితే రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి, అరుదైన క్రెడిట్‌ను కొట్టేయాలనే ఆలోచన కూడా బిజెపి అధినాయకుడు ప్రధాని మోదీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. అయినప్పటికీ రాష్ట్రపతిగా ఎవరిని ప్రతిపాదిస్తున్నదీ అధికార ఎన్డీయే కూటమి ఎలాంటి స్పష్టతనూ ఇవ్వడం లేదు.
దాదాపు ఏడాది కాలం నుంచి ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థులంటూ అనేక మంది పేర్లు వినిపిస్తున్నాయి. సీనియర్ నేత ఎల్‌కె అడ్వాణీ మొదలు అనేక మంది పేర్లు ఈ జాబితాలో వినిపించాయి. అయితే కమలం పార్టీ మాత్రం ఎలాంటి స్పష్టతనూ ఇవ్వ లేదు. తాము ప్రతిపాదించిన అభ్యర్థిని ఏకగ్రీవంగా, పోటీ అనివార్యమైతే తమ అభ్యర్థిని సులభతరంగా గెలిపించుకునేందుకు ఎన్డీయేతర పార్టీలను కూడా కలుపుకుపోవాలనుకుంటున్నారు వారు. ఇందుకోసం అనేక రాష్ట్రాలలో నయానా భయానా ప్రాంతీయ పార్టీలతో కూడా మాట్లాడుతున్నారు. అయితే అభ్యర్థి ఎవరనే విషయాన్ని మాత్రం చెప్పకుండా గుంభనంగా ఉంటున్నారు. అడ్వాణీ తర్వాత ద్రౌపది ముర్ము, మురళీ మనోహర్ జోషి.. వంటి పేర్లు వినిపించగా, సుష్మా స్వరాజ్ పేరు ప్రస్తుతం వినిపిస్తోంది.
అయితే సుష్మ అభ్యర్థిత్వం విషయంలోనూ ఎలాంటి ధృవీకరణా లేదు. ఆ సంగతలా ఉంటే రాష్ట్రపతి రేసులో కొన్ని అనూహ్య నామధేయాలూ వినిపిస్తున్నాయి. ఎవ్వరూ ఊహించని వాళ్లను అభ్యర్థులుగా ప్రకటించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో మెట్రో శ్రీధరన్ లాంటి వాళ్ల పేర్లు తెరపైకి రాగా, ఏమైనా జరగొచ్చు, ఎవరైనా రాష్ట్రపతి అభ్యర్థి కావొచ్చు.. వారు రాజకీయ నేత అవ్వాల్సిన అవసరమూ లేదు.. గతంలో అబ్దుల్ కలాంను ఇలాగే కదా ప్రకటించారు అనే మాటా వినబడుతోంది. మరి మన భావి రాష్ట్రపతి ఎవరో వేచి చూద్దాం!