హార్లిక్స్ అనగానే నేను తాగను, తింటాను అని మూతి నిండా హార్లిక్స్ పొడి అంటుకున్న చిన్నారులతో యాడ్ గుర్తుకు వస్తుంది కదా. పిల్లలకి, ఆడవాళ్ళకి, ముసలి వాళ్లకి అందరికి ఆరోగ్యం, భలం కోసం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వెంటనే కొనేది హార్లిక్స్ . అంతగా అలవాటు అయ్యింది హార్లీక్స్ అందరికి. హార్లిక్స్ హృదయాంజలి దూరదర్శన్ లో ప్రసారమై ప్రేక్షకులను అలరించేది. దీనికి ఉదయభాను యాంకరింగ్ చేసేది. ఎన్ని కొత్త కంపెనీలు పుట్టుకు వచ్చినా, హార్లీక్స్ కి ఉన్న డిమాండ్ తగ్గకపోవడమే దీని ప్రత్యేకత.
అసలు హార్లిక్స్‌ను కనిపెట్టింది ఎవరో తెలుసుకుందాం… హార్లిక్స్‌ను కనిపెట్టింది ఇద్దరు అన్నదమ్ములు. వారే విలియం హార్లిక్స్,జేమ్స్ హార్లిక్స్. విలియం పెద్దవాడు. జేమ్స్ చిన్నోడు. ఇద్దరూ ఆహారపదార్థాల తయారీలో కొత్త ప్రయోగాలు చేసేవారే. వీరు ఇంగ్లాండ్ కు చెందినవారే కాని, జీవనోపాదికి అమెరికా వెళ్ళారు. 1873 ప్రాంతంలో విలియం హార్లిక్స్ చంటిపాపల కోసం హార్లిక్స్ ను తయారు చేయగా… దానికి మాలెడ్ మిల్క్ అనే పేరు పెట్టారు. వేడి నీళ్ళలో ఈ పొడి కలుపుకొని తాగితే బాగుంది. అంతే దాన్ని బాగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక్కసారి రుచి చూద్దామని చూసిన ప్రజలకి బాగా నచ్చింది.
అన్నదమ్ములు వెంటనే చికాగోలో ఫ్యాక్టరీ పెట్టారు. తరవాత 1908లో స్వదేశానికి వెళ్లి అక్కడ హార్లిక్స్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి ప్రచారం ఇంకా బాగా చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసారు. 1960లో హార్లిక్స్ పంజాబ్‌లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. పసిపిల్లలే కాదు పర్వతారోహకులు హార్లిక్స్ ను తమ వెంట ఉంచుకొనే స్థాయికి ప్రచారం తీసుకువెళ్లారు.