శ్రీనగర్: కశ్మీర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలోని ద్రబ్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు శుక్రవారం నిర్బంధ తనిఖీలు నిర్వహించారని వెల్లడించారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు వారి చర్యలను తిప్పికొట్టాయి. ఈ తనిఖీల్లో రాష్ట్రీయ రైఫిల్స్, కేంద్రీయ రిజర్వ్ పోలీసు బలగాలు (సిఆర్‌పిఎఫ్), రాష్ట్ర పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ బృందం (ఎస్ఒజి) పాల్గొన్నాయి. భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారన్న విషయాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. అయితే, వారు జైషే మహమ్మద్ ఉగ్రవాదులని తెలుస్తోంది. ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య పరస్పరం కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు తెలిపారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి పారిపోకుండా భద్రతా బలగాలు పలు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన నేపథ్యంలో పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో మొబైల్ అంతర్జాల సౌకర్యాలను నిలిపేశారు. భద్రతా బలగాల చేతిలో హతమైన ఉగ్రవాదుల పేర్లు షాహిద్ అహ్మద్ బాబా, అనియాత్ అహ్మద్ జింగర్‌గా అధికారులు గుర్తించారు. వారిరువురూ జైషే మహమ్మద్ ఉగ్రవాదులని భావిస్తున్నారు. వారి నుంచి పలు ఆయుధాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
RELATED ARTICLES