168 మందికిపైగా మృతి
క్యారిటా: ఇండోనేసియాలో మరోసారి సునామీ విధ్వంసం సృష్టించింది. దీంతో 168 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. దక్షిణ సుమత్రా, పశ్చిమ జావాలోని బీచ్‌ల్లో శనివారం రాత్రి 9.30 సమయంలో అకస్మాత్తుగా సునామీ సంభవించడంతో ప్రజలంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సునామీలో దాదాపు 20 మంది గల్లంతైనట్లు తెలుస్తోందని, వారి ఆచూకీ కోసం సహాయక బృందాలను మోహరించినట్లు విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి పుర్వో నుర్గోహో వెల్లడించారు. క్రాకటోవ్ అగ్ని పర్వతం పేలడం వల్లే సునామీ వచ్చి ఉంటుందని నుర్గోహో వెల్లడించారు. ఈ అగ్నిపర్వతం పేలుడు కూడా భారీ స్థాయిలో జరగలేదని స్థానిక వార్తా సంస్థకు ఆయన వెల్లడించారు. ఉవ్వెత్తున ఎగసిపడ్డ అలల ధాటికి తీర ప్రాంతంలోని భవనాలన్నీ దెబ్బతిన్నాయి. బీచ్‌లు, ఇతర తీర ప్రాంతాల్లోని నివాస సముదాయాల వద్ద ముందస్తు హెచ్చరికలేవీ చేసే వీలు లేకపోయింది. సునామీ ధాటికి కొన్ని చోట్ల భారీ వృక్షాలు సైతం వేళ్లతో సహా కూలిపోయాయి. పర్యాటకులు అధికంగా ఉన్న బీచ్‌పై ఉన్నట్టుండి భారీ అల ఎగసిపడి.. వినాశనం సృష్టించిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. సునామీకి గల కచ్చితమైన కారణాలను కనుగొనేందుకు ఇండోనేషియా భూగోళ పరిశోధన విభాగం ప్రయత్నాలు చేస్తోంది.