ఘనంగా 150వ జయంతి
ప్రజాపక్షం / హైదరాబాద్ : లెనిన్ 150వ జయంతి మఖ్దూంభవన్‌లో బుధవారం ఘనంగా జరిగింది. లాక్‌డౌన్ కారణంగా అందుబాటులో ఉన్న కొద్ది మందితో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి లెనిన్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ లెనిన్ రష్యాలో పుట్టి నాటి జార్ చక్రవర్తుల పాలన నుండి విముక్తి కల్గించేందుకు విరోచిత పోరాటం చేశారని అన్నారు. మార్కిజాన్ని అధ్యయనం చేసుకొని మార్క్ రాసిన కమ్యూనిస్టు ప్రణాళికను, ఎంగిల్స్ రాసిన సూత్రాలను అర్థం చేసుకొని వాటి అమలు కోసం కృషి చేశారని కొనియాడారు. రష్యాలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత లెనిన్‌కే దక్కుతుందన్నారు. లెనిన్ రష్యా విప్లవోద్యమానికి సారథ్యం వహించారని, ప్రపంచంలో మార్కిజాన్ని అమలు చేశారని అన్నారు, సమసమాజ నిర్మాణం కొరకు, అంతరాలు లేని సమాజం కొరకు లెనిన్ పరితపించారన్నారు, ఆయన అనేక త్యాగాలు, కృషి చేశారన్నారు. 1917లో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం రష్యాలో ఏర్పడిన తర్వాత దాని ప్రభావంతో తూర్పు యూరోప్ దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా మార్కిజం సిద్ధాంతం విస్తరించిందని అన్నారు. ప్రపంచ మానవాళికది ఒక మార్గాన్ని సూచించిందన్నారు. శ్రమ దోపిడీకి గురయ్యే రైతులు, కూలీలు, కార్మికులు, అసంఘటిత కార్మికులందరికీ ఆశాజ్యోతి లెనిన్ అని శ్లాఘించారు, లెనిన్ విడిచిపెట్టి పోయిన ఆశయాలు, ఆకాంక్షలు ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఆ సిద్ధాంతాలు అమలవుతున్నాయని అన్నారు. ఇప్పటికీ అనేక దేశాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయని తెలిపారు. కార్మికులకు, కర్షకులకు అణగారిన వర్గాలకు అండగా ఉంటున్నాయని తెలిపారు. లెనిన్ అజరామరుడని, ఆయన భౌతికంగా మనకు దూరమైనా ప్రపంచ మానవాళి హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారని చాడ పేర్కొన్నారు.
వలస కార్మికుల బతుకులు అగమ్యగోచరం
ఆదుకోవడానికి తక్షణం చర్యలు : చాడ డిమాండ్
ప్రజాపక్షం / హైదరాబాద్ : కరోనా కట్టడికి జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన లాక్‌డౌన్ తెలంగాణ రాష్ట్రంలో మే 7 వరకు పొడిగించిన దరిమిలా రెండు మాసాలు ప్రజలు ఇళ్ళ లో ఉండాల్సి వస్తోందని, వలస కార్మికుల బతుకు ఆగమ్య గోచరంగా తయారయ్యిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వారు ఊర్లకు వెళ్ళాలంటే బస్సు లు లేక కాలినడకన వెళుతున్నారని, చిన్న పిల్లలు సొమ్మసిల్లి చనిపోతున్నారని అన్నారు. అకస్మాత్తుగా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల ఇలాంటి పరిణామాలు తలెత్తాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా వలస కార్మికులను ఆదుకోడానికి కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వలస కార్మికులు మూడున్నర లక్షలు ఉన్నాయరని చెబుతోందని, తమకున్న సమాచారం మేరకు వలస కార్మికులు 8 లక్షలు ఉన్నారని వారిపై ప్రత్యేక దృష్టి పెంట్టాలని కోరారు. తెల్ల కార్డు లేని వారు 11 లక్షల వరకు ఉంటారని అంచనా ఉందని వారికి ఆర్థిక సహాయం అందించాలన్నారు. కార్డు లేని వారికి బియ్యం, డబ్బులు ఇవ్వక పోవడం అన్యాయమన్నారు. స్కీం వర్కర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలకు జీతాలు లేక అలమటిస్తున్నారని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామి పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించడం అన్యాయమన్నారు. గత సంవత్సరం ఇప్పటివరకు ఆరేడు లక్షల మందికి పని కల్పించగా ఈ సంవత్సరం లక్ష మందికి కూడా సరిగ్గా పని కల్పించలేక పోయారని చాడ వెంకట్ రెడ్డి అన్నారు.