రాజ్యాంగ పరిరక్షణ కోసం ఉద్యమించాలని నేతల పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి ఉత్సవాలను సిపిఐ రాష్ట్ర సమితి మంగళవారం మఖ్దూంభవన్‌లో ఘనంగా నిర్వహించింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా మఖ్దూంభవన్‌లో ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ దళిత కుటుంబంలో పుట్టిన అంబేద్కర్ అనేక అవస్థలు పడ్డారని, విదేశాల్లో బారిస్టర్ చదువులు పూర్తి చేసుకున్న అంబేద్కర్ దేశానికి వచ్చి దేశ స్వాతంత్య్రానంతరం రాజ్యాంగ నిర్మాణానికి పూనుకున్నారన్నారు. దేశ సామాజిక, ఆర్థిక, స్థితిగతులను అధ్యయనం చేసిన ఆయన అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారత్‌కు ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. పేదరికం, నిరక్ష్యరాస్యత, అంటరానితనం, వివక్ష ఉన్న మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవ్యవస్థకు పెద్దపీట వేశారన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించారని కొనియాడారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి నిలువుటద్దంగా పనిచేస్తోందన్నారు. నేడు రాజ్యాంగానికే సవాలు వచ్చిందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. నేటి పాలకులు లౌకికవ్యవస్థకే భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు. మతాల ముసుగులో పరిపాలన కొనసాగుతోందని, మత మహమ్మారి దేశంలో మరింత గందరగోళం సృష్టిస్తోందన్నారు. మరోవైపు కార్పొరేట్ సంస్థలు అడ్డగోలుగా పెరిగిపోతున్నాయని, సహజ వనరులను కొల్లగొడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మధ్య అంతరాలు బాగా పెరిగిపోతున్నాయని, పేదలు పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారన్నారు. అక్ష్యరాస్యత కూడా 62 శాతానికి మించి లేకపోవడం దౌర్భాగ్యకరమన్నారు. దేశంలో ఇప్పటికీ సామాజిక, ఆర్థిక సమస్యలున్నాయని, సామాజిక న్యాయానికి ఉద్యమించడం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడం తక్షణ కర్తవ్యంగా ప్రతి పౌరుడు భావించాలన్నారు. అదే అంబేద్కర్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. రానున్నకాలంలో అంతరాలు లేని సమాజాన్ని, సమసమాజం కోసం అడుగులేయాలని చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో బిజెపి వచ్చిన తర్వాత ఫాసిస్టు పాలన కొనసాగుతోందని, అణచివేతలు పెరిగిపోతున్నాయని, భావస్వేచ్ఛకు, పౌరహక్కులకు భంగం కలుగుతోందని విమర్శించారు. పౌరహక్కుల నేతలను అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాలకులకు చెక్ పెట్టేందుకు, బుద్ధి చెప్పేందుకు కంకణబద్ధులు కావాలన్నారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ అట్టడుగు వర్గాల కోసం, అంటరానితరానికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చి 70 ఏళ్ల తర్వాత ఆయన రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే పద్దతిలో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి, ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే పద్దతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజాస్వామ్యానికి, పౌరహక్కుల నాయకులకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. డాక్టర్ వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబా, ప్రొఫెసర్ కాశీం జైళ్లలో మగ్గుతున్నారని, అంబేద్కర్ మనుమడు తేల్‌తుంబ్డేను అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.