శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని సోపియాన్, బందిపొర జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌కు ఇద్దరితో సహా ముగ్గురు హతమయ్యారని, వారి వద్ద బందీగా ఉన్న బాలుడు కూడా మృతి చెందాడని పోలీసులు తెలిపారు. గత 24 గంటల్లో ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొర జిల్లా హజిన్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కర్ ఇ తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు. గురువారం నాడు కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. వారు ఇద్దరు పౌరులను బందీలుగా ఉంచుకున్నారని, వారిలో ఒకరైన అబ్దుల్ హమీద్‌ను గురువారం సాయంత్రం వారి చెర నుంచి రక్షించామని, మరో 12 ఏళ్ల బాలుడు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని తెలిపారు. హతమైన ఇద్దరు ఉగ్రవాదులను పాకిస్థాన్ జాతీయులు అలీ, హుబైబ్‌లుగా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్‌లోని సోపియాన్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఉగ్రవాది హతమయ్యాడని వెల్లడించారు. ఇమామ్ సాహిబ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతాదళాలు శుక్రవారం కార్డన్‌సెర్చ్ నిర్వహించాయి. దీంతో ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమైనట్టు తెలిపారు. మరో ఎన్‌కౌంటర్ దక్షిణ కశ్మీర్‌లోని బారాముల్ల జిల్లాలో ఎన్‌కౌంటర్ జరుగుతోందని పోలీసు అధికారులు చెప్పారు. ఈ ఘటన ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరగలేదని, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గురువారం నాడు బారాముల్ల జిల్లా కలంతరలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. మృతుల్లో ఒకరిని సోపోర్‌కు చెందిన అమీర్ రసూల్‌గా, మరొకరిని పాక్ జాతీయుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ పోలీస్ అధికారికి గాయాలయ్యాయి.
వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతం
RELATED ARTICLES