హైదరాబాద్: తెలంగాణ ఇచ్చామని, రాష్ట్రాన్ని తెచ్చామని, తెలంగాణను పెంచామనే వాళ్లు ప్రస్తుత ఎన్నికల్లో మన ముందున్నారని, వారిలో ఎవరికి ఓటు వేయాలనే అయోమయం ప్రజల్లో ఉందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. బుధవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అత్యంత ఎక్కువ పారదర్శకత, అత్యంత తక్కువ అవినీతితో ఎవరైతే మెరుగైన పాలన ఇవ్వగలరని భావిస్తారో వారికే ఓటు వేయాలని, దీనిపై ప్రజలంతా లోతుగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని తద్వారా తెలంగాణకు బలమైన ప్రభుత్వాన్ని అందివ్వాలని ఆయన కోరారు. తెలంగాణ యువత పోరాట స్ఫూర్తిని, పోరాటాన్ని, త్యాగాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాడిని కనుకే తనకు తెలంగాణ అంటే అంత గౌరవమని తెలిపారు. ముందస్తు ఎన్నికల వల్ల సమాయాభావం కారణంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయామని ఆయన పునరుద్ఘాటించారు. చివరగా ‘జై తెలంగాణ.. జైహింద్’ అంటూ పవన్ తన సందేశాన్ని ముగించారు.
https://twitter.com/PawanKalyan/status/1070248955030564864?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1070248955030564864&ref_url=http%3A%2F%2Fwww.eenadu.net%2Fhomeinner.aspx%3Fca