ప్రజాపక్షం/హైదరాబాద్ : దివంగత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సతీమణి, ప్రముఖ చలన చిత్ర దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి తమ్మారెడ్డి కృష్ణవేణి (95) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నాగార్జున నగర్‌లో ఉన్న తన నివాసంలో ఆమె మృతి చెందారు. సిఆర్ ఫౌండేషన్ ప్రారంభించిన నాటి నుంచి ఆశ్రమంలో ఉన్న సీనియర్లలో కృష్ణవేణి కూడా ఒకరు. ఆమె మృతి పట్ల గౌరవాధ్యక్షులు సురవరం సుధాకర్‌రెడ్డి, అధ్యక్షులు కె. నారాయణ, ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శి చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి వి. చెన్నకేశవరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ కూనమనేని రజని విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. తమ్మారెడ్డి భరద్వాజ, ఇతర కుటుంబ సభ్యులకు వారు సానుభూతిని తెలిపారు. కాగా, కృష్ణవేణి అంత్యక్రియలు నగరంలోని ఫిలింనగర్‌లో ఉన్న మహాప్రస్థానంలో సాయంత్రం జరిగాయి.
తమ్మారెడ్డి కృష్ణవేణి మృతికి సిపిఐ సంతాపం
దివంగత తమ్మారెడ్డి కృష్ణమూర్తి సతీమణి, ప్రముఖ చలన చిత్ర దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి తమ్మారెడ్డి కృష్ణవేణి (95) హైదరాబాదులో మరణించారు. వీరి మరణం పట్ల సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి తరపున సంతాపం, వారి కుటుంబ సభ్యులకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సానుభూతిని వ్యక్తం చేశారు. ఆమె మొదటి నుంచి ఇప్పటివరకు కమ్యూనిస్టు పార్టీ పట్ల అభిమానంతోనూ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో ఉన్నారు.