రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 644
రాష్ట్రంలో రెండు రకాలుగా వ్యాప్తి చెందుతున్న వైరస్
క్వారంటైన్ అయిన వారిలోనూ వ్యాప్తి చెందుతున్న కరోనా
తండ్రి ద్వారా ఏడేళ్ల బాలుడికి సోకిన వైనం
కుటుంబ సభ్యులందరిని ఐసోలేషన్‌కు తరలింపు
భయాందోళనలు కలిగిస్తున్న హైదరాబాద్ నగరం
నగరంలోనే 270 పాజిటివ్ కేసులు
తాజాగా పాతబస్తీలో ఒక్క కుటుంబంలోనే 17 మందికి కరోనా పాజిటివ్
ఒక్క కేసు పాజిటివ్ ఉన్నా ఆ ప్రాంతాన్ని క్లస్టర్‌గా గుర్తింపు
దేవ్‌బంద్ వెళ్లి వచ్చిన వారిలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
తాజాగా అజ్మీర్ దర్గా ప్రార్థనల కలకలం
కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ల విచారణ
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణలో రోజురోజుకు కరోనా దడ తీవ్రమవుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరగుతోంది. ఒక్కరోజే 52 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 644కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 52 కేసులు నమోదుకాగా, ఒకరు మరణించారని, ఏడుగురు డిశ్చార్జి అయ్యారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ వెల్లడించింది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 516 ఉండగా, ఇప్పటివరకు మొత్తంగా 110 మంది డిశ్చార్జి అయ్యారు. అలాగే మరణాల సంఖ్య 18కి చేరింది. క్వారంటైన్, ఐసోలేషన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన వారితోనూ కరోనా వ్యాప్తి చెందుతుండడం ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ శివారులోని అమీన్‌పురా మండలం బీరంగూడకు చెందిన ఒక వ్యక్తి క్వారంటైన్ పూర్తి చేసుకుని రాగా, ఆయన ఏడేళ్ల కుమారుడికి కరోనా పాజిటివ్ వెలుగుచూసింది. అలాగే హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో తండ్రి స్విట్జర్లాండ్ వెళ్లి రాగా.. ఆయనకు కరోనా లేకున్నా ఆయన కుమారుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించారు. అయితే కరోనా లక్షణాలు లేకున్నా… వారి కుటుంబసభ్యులకో, లేక వారి ప్రాంతాల్లోనో కరోనా పాజిటివ్ ఉన్నప్పడు, కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. అనంతరం వారిని ఇళ్లకు పంపించి మరో 14 రోజులు ఇళ్లలోనే స్వీయ క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య రాష్ట్రంలో వేలల్లో ఉంది. దీంతో వారిపై సరైన నిఘా పెట్టలేకపోతుండడం, వారు ఇళ్లలోనే ఉంటున్నారా, లేక బయటకు వెళ్లి వేరేవారితో కలుస్తున్నారా అనేది తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కరోనా పాజిటివ్ కేసులు క్వారంటైన్ అయి వెళ్లిన వారి కుటుంబాల్లోనూ, వారి సన్నిహితుల్లోనూ తాజాగా కరోనా పాజిటివ్ వెలుగుచూస్తుండడంతో వీరి వల్లనే కరోనా వ్యాప్తి చెందుతుందేమోనని అధికారులు భావిస్తున్నారు. అంతే కాదు.. రాష్ట్రం లో రెండు రకాలుగా కరోనా వ్యాప్తి చెందుతోందని వైద్యవర్గాలు తెలిపాయి. ఒకటి ప్రైమరి కాంటాక్ట్ అయిన వారి ద్వారా కాగా, రెండోది ఎలాంటి లక్షణాలు లేకున్నప్పటికీ కరోనా వస్తోంది. తాజాగా ఒక వృద్ధురాలికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కరోనా పాజిటివ్ తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా భయం మరింత ఎక్కువ అవుతోంది. దీనికి తోడు సెకండరీ కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రైమరీని ఎలాగోలా కట్టడి చేసినప్పటికీ వారి ద్వారా కరోనా బారిన పడిన సెకండరీ కేసులు తాజాగా వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రంలో గత మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయన్న తరుణంలో ఒక్కసారిగా మళ్లీ అధికమయ్యాయి. రెండుమూడు రోజులుగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 20లోపే నమోదు కాగా, తాజాగా ఒక్కరోజే 61కేసులు నమోదయ్యాయి. ఇది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్కరోజే అత్యధికంగా నమోదైన కేసుల్లో మూడోది. ఏప్రిల్ మూడున అత్యధికంగా 75, ఏప్రిల్ 5న 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాల్లో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల కంటే కూడా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అత్యధికంగా రెడ్‌జోన్లు, హాట్‌స్పాట్లు, కంటైన్మెంట్ జోన్లు, క్లస్టర్లు ఏర్పాటు చేసి పూర్తిగా అష్టదిగ్భందనం చేసినప్పటికీ కొత్తగా కేసులు నమోదుకావడం పట్ల అటు ప్రభుత్వం, ఇటు వైద్యవర్గాల్లోనూ కొంత కలవరాన్ని కలిగిస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ నగరం రాష్ట్రంలోనే అత్యంత హైరిస్క్ ప్రాంతంగా మారింది. పాత బస్తీలోని భవానీ నగర్‌లో తాజాగా ఒకే ఇంట్లో 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 444 కాగా ఒక్క హైదరాబాద్‌లోనే 270 పాజిటివ్ కేసులు ఉన్నాయి. దీంతో నిన్నటి వరకు పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలనే క్లస్టర్లుగా గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా ఒక్క పాజిటివ్ కేసున్నా సరే ఆ ప్రాంతాన్ని క్లస్టర్‌గా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. జోన్లను, క్లస్టర్లను, హాట్‌స్పాట్‌లను పెంచింది. ఒక్కో జోన్‌కు ఒక ప్రత్యేక మెడికల్ ఆఫీసర్‌తో పాటు రెవెన్యూ, పురపాలక అధికారులను కూడా నియమించాలని నిర్ణయించారు. ఆయా జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రారంభించారు. రాష్ట్రాన్ని తాజాగా మళ్లీ ప్రార్థనల వ్యవహారం కొంత ఆందోళన కలిగించడం మొదలుపెట్టింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌లో జరిగిన మర్కజ్ తరహా ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో సోమవారం ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరొకటి పాజిటివ్ వచ్చింది. ఆసిఫాబాద్, జైనూర్‌లలో దేవ్‌బంద్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో ఒక్కొక్కరికి పాజిటివ్ కేసు నమోదయింది. నిర్మల్ నుంచి దేవ్‌బంద్‌కు వెళ్లి వచ్చిన ఇద్దరు అన్నదమ్ములకు కరోనా పాజిటివ్ వెలుగుచూసింది. అంతే కాదు ఈ తరహా ప్రార్థనవు మార్చి నెలలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనూ జరిగాయని కేంద్ర ఇంటెలిజెన్స్ స్పష్టం చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు భావించి ఈ రెండు రాష్ట్రాలను కేంద్ర ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసింది. తెలంగాణ నుంచి దేవ్‌బంద్‌కు దాదాపు 100 మంది, ఈ తరహా ప్రార్థనలే జరిగిన అజ్మీర్ దర్గాకు దాదాపు 60 మంది వెళ్లి వచ్చారని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. పూర్తి లెక్కలు తీసేందుకు విచారణ ప్రారంభించారు.
ఆంధ్రపదేశ్‌లోనూ పెరుగుతున్న కేసులు
చాలా తక్కువగా కరోనా వ్యాప్తి ఉందని, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని భావిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం రాత్రి 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకే ఇక్కడ మొత్తం 34 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా గుంటూరులో 16, కృష్ణాలో 8, కర్నూల్‌లో 7, అనంతపురంలో రెండు, నెల్లూరులో ఒక్క కేసు నమోదయింది. అయితే కేసులు తగ్గుముఖం పట్టాయని గుంటూరులో కొంత సడలింపు ఇచ్చారు. సరిసంఖ్య తేదీల్లో నిత్యావసరాలు కొనుగోలుకు అనుమతి ఇచ్చారు. అయితే ఒక్కసారిగా మళ్లీ కేసులు పెరగడంతో ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచనలో పడింది. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం మీద పరిశీలిస్తే.. ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. అత్యధికంగా గుంటూరులో 107, కర్నూల్‌లో 90, నెల్లూరులో 54 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకు కరోనా ఊసే లేదు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా తీవ్రత వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 2155 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీటిలో మంగళవారం మధ్యాహ్నం వరకే 121 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో గడిచిన 12 గంటల్లో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 10,663 పాజిటివ్ కేసులు నమోదు కాగా 1036 మంది కోలుకున్నారు. 8988 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకు 339 మంది మరణించారు.