HomeNewsBreaking Newsతెలంగాణలో 30 వరకు లాక్‌డౌన్‌

తెలంగాణలో 30 వరకు లాక్‌డౌన్‌

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ మంత్రివర్గం నిర్ణయం
1 నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు, పై తరగతులకు విద్యార్థులు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు
ఏప్రిల్‌ 30 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తాం, ప్రజలంతా సహకరించాలి
రాష్ట్రంలో 503కి చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు, ఇప్పటివరకు 14 మంది మృతి
మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం సుదీర్ఘంగా సాగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. సమావేశానంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మీడియా సమావేశంలో క్యాబినెట్‌ నిర్ణయాలను వెల్లడించారు. లాక్‌డౌన్‌ను తప్పనిపరిస్థితుల్లో ఏప్రిల్‌ 30వ తేదీ వరకు పొడిగించాలని నిర్ణయించామని, ఎప్పటిలాగే ప్రజలు సహకరించాలని కోరారు. ఈ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో కొనసాగిస్తే, కరోనా నుంచి మనం బయటపడగలుగుతామని తెలిపారు. ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థుల పరీక్షలను రద్దు చేశామని, వారిని పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్‌ చేస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నదని, అగ్రదేశాలతో పోల్చితే మన దేశం సురక్షిత స్థితిలోనే వుందని చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల వల్లనే ఇది సాధ్యమైందన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన దేశాలు సైతం మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితులు వస్తున్నాయని, కరోనా వైరస్‌ విచిత్ర పరిస్థితే అందుకు కారణమన్నారు. సింగపూర్‌, జపాన్‌లలో పరిస్థితి తిరగబడిందని గుర్తు చేశారు.
503కి పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాధికి సంబంధించి ఇతర దేశాల నుంచి  వచ్చిన వారు 34 మంది ద్వారా వైరస్‌ సంక్రమించిన వారు నూటికినూరు శాతం డిశ్చార్జి అయ్యారని చెప్పారు. తొలి దశలో 25,937 మందిని క్వారంటైన్‌లో పెట్టామని, వారంతా డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 503, ఇందులో 14 మంది చనిపోగా, 96 మంది డిశార్జి అయ్యారని వెల్లడించారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 393 మంది చికిత్స పొందుతున్నారన్నారు. మర్కజ్‌కు సంబంధించిన వారిని 1200 మందిని, వారి బంధువులను చెక్‌ చేశామని, ప్రస్తుతం కేసుల తాకిడి తగ్గిందన్నారు. వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టామని, రాష్ట్రలో 243 చోట్ల కంటైన్మెంట్‌ కేంద్రాలుగా గుర్తించి, చర్యలు తీసుకుంటున్నామని కెసిఆర్‌ చెప్పారు. క్వారంటైన్లలోగానీ, కంటైన్మంట్లలోగానీ ఏ ఒక్కరికీ సీరియస్‌ లేదన్నారు. ఏప్రిల్‌ 24 నాటికి అందరూ డిశ్చార్జి అయిపోతారన్నారు. కొత్త ఉత్పాతం రాకపోతే, మనం బయటపడినట్లేనని చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దులో కఠినచర్యలు తీసుకుంటామన్నారు. మర్కజ్‌ ఉదంతం లేకపోతే, ఏనాడో మన రాష్ట్రం పరిస్థితి మెరుగుపడేదని చెప్పారు.
లాక్‌డౌన్‌ కఠినంగా అమలు
అందరి మంచిని కాంక్షించి, ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అందరూ నియమాలు పాటించి, ప్రజలకు సహకరించాలన్నారు. అంతా సవ్యంగా వుంటే, ఏప్రిల్‌ 30 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని చెప్పారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనపడాల్సిన పనిలేదన్నారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందర్నీ ప్రొమోట్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. తొలిసారిగా రాష్ట్రంలో పంటలు బాగా పండుతున్నాయని, 40 లక్షల ఎకరాల్లో పంటలు పండాయని చెప్పారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఈ నెల 15 వరకు అన్ని ప్రాజెక్టుల పరిధిలో నీళ్లు విడుదల చేస్తామని చెప్పారు. మోడీతో వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరారని వెల్లడించారు. ఈ పదిహేను రోజులు కూడా లాక్‌డౌన్‌ కొనసాగిస్తే, చాలా వరకు కరోనా వైరస్‌ను అదుపు చేయవచ్చన్నారు. ప్రజలు కచ్చితంగా స్వీయ నియంత్రణ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను పొడిగించాలన్న మంత్రివర్గ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు. ఇవికాకుండా మరికొన్ని విజ్ఞప్తులు కూడా చేస్తున్నామని, వాటన్నింటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు మినహాయింపు, కల్తీచేస్తే పిడియాక్ట్‌
ఆహార విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించామన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అక్రమాలకు పాల్పడే వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని కెసిఆర్‌ హెచ్చరించారు. నూనెలు, ఆహారపదార్థాల విషయంలో కల్తీకి పాల్పడిన వారిపై పిడియాక్టు కింద కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ఈ సమయంలో వ్యవసాయ కోతలు జరుగుతున్నాయని, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, నరేగాను కనీసం 50 శాతం కూలీలకు వర్తింపజేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాలకు ఇచ్చిన అప్పులపై ఆరు మాసాలపాటు మారటోరియం ఉంచాలని కోరుతున్నామన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమయం పడుతుందని, పంటల కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. అలాగే, ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని  ఐదు లేదా ఆరు శాతం పెంచాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఇప్పుడున్న పరిస్థితి వందేళ్లలో ఎన్నడూ రాలేదని, రాష్ట్రాల, కేంద్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ అనే ఆర్ధిక విధానం అమలు చేయాల్సిన అవసరం వుందన్నారు. వ్యవసాయానికి, అన్ని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు మినహాయిస్తున్నామని చెప్పారు. రైతులు కూడా ఐసోలేషన్‌ పాటిస్తూ సాగు పనులు చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఆహార సరఫరా బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. కోట్ల మందికి మాస్కులను పంపిణీ చేయడం ప్రభుత్వానికి సాధ్యం కాదని, అందుకే ప్రజలే వాళ్ల ఇళ్లలో సొంతమాస్కులు తయారు చేసుకోవాలని సూచించారు. మనకు విస్తృతమైన సరిహద్దు ప్రాంతం ఉన్నందున, రాకపోకలు, బంధుత్వాలు ఎక్కువని, అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని, నిఘాను పెంచామని తెలిపారు. ముఖ్యంగా ప్రమాదకరస్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర విషయంలో అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని, అందువల్ల మహారాష్ట్ర సరిహద్దును మూసివేస్తున్నామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments