న్యూఢిల్లీ : ప‌్రధానమంత్రి ఏదో ఒక వేదికపై మాట్లాడుతున్నారు. కరోనా గురించి భయపడొద్దని చెపుతున్నారు. సామాజిక దూరమే దీనికి మందు అని అంటున్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు రెండు రోజులకోసారి ప్రెస్‌మీట్ పెడుతున్నారు. ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఇళ్లల్లో కూర్చొన్న జనం ప్రభుత్వ చర్యలను హర్షిస్తున్నారు. అంతవరకు బాగానే వుంది. రోడ్డునపడి నడకమార్గంలో ఏడేసి రోజులుగా మూటలు మోసుకుంటూ ప్రయాణిస్తున్న వలసకూలీలకు భరోసా ఏదీ? ప‌్రభుత్వ సాయం గురించి వారికి సమాచారమేదీ? వారి వెంటపడి, వారిని ఆపి, వారికి రెండు ముద్దల అన్నం పెట్టేదెవరు? చెక్‌పోస్ట్ పడేదాకా వారు నడుస్తూనే వున్నారు. అక్కడ వారికి క్వారంటైన్ అంటున్నారు. వారిపై వైరస్ వుందేమోనని రసాయనాల నీళ్లు కొడుతున్నారు. వారి దయనీయ పరిస్థతి అగమ్యగోచరంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే, కరోనా వైరస్ పేదలను పిండేస్తున్నది. ముఖ్యంగా రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు లాక్‌డౌన్ కారణంగా పనులు పూర్తిగా బంద్ కావడంతో ఏం చేయాలో తోచక దిక్కులేని స్థితిలో పడ్డారు. దేశంలో విధించిన 21రోజుల లాక్ డౌన్ సమయంలో నగరాల నుంచి కార్మికులు, వలస కూలీలు తమ స్వస్థలాలకు కాలినడకన ప్రయాణించడం కలిచివేస్తోంది. చిన్నపిల్లలు, వృద్ధులు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎక్కడివారు అక్కడే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తిచేస్తున్నా వేలసంఖ్యలో కూలీలు కాలినడకన బయలుదేరుతున్నారు. వారికి తగిన సహాయక చర్యలు అందకపోవడమే అందుకు ప్రధాన కారణం. అందరికీ బియ్యం, నగదు అందజేస్తున్నామని చెపుతున్నప్పటికీ, అదంతా గాలిమాటలేనని తేలిపోయింది. రేషన్‌కార్డు లేకుండా బియ్యం, నగదు ఇచ్చే అవకాశమే లేదు. వలసకూలీలకు రేషన్‌కార్డు ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది సమస్య. కార్డులతో పనిలేకుండా సాయం చేస్తామంటే అదీ జరగడం లేదు. చెక్‌పోస్ట్‌ల వద్ద వలసకూలీలకు మూడు పూటలా భోజనమే పెట్టడం లేదు. వలస కూలీల ప్రయాణాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకున్నది. దీనిపై సుప్రీం కోర్టులో తాజాగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై విచారించనున్నది. ఈ సమయంలో రోజువారీ, వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లకుండా ప్రస్తుతం ఉన్నచోచే ఉండాలని కేంద్రప్రభుత్వం సూచించింది. వారికి భోజన వసతి కలిపించేందుకు అన్నిరాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది.
కలచివేస్తున్న వలస కష్టాలు : సుప్రీం జోక్యం
RELATED ARTICLES