ఎంఎల్ఎలను మార్చకపోతే ప్రమాదం ఉందని కెటిఆర్‌కు ముందే చెప్పా
మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్
హైదరాబాద్: ఎవరో వ్యక్తులు తనపై ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని తాను కాదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తనకు పదవుల కన్నా వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమిదే పైచేయి అని ఆయన విశ్లేషించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కెటిఆర్ విమర్శలు గుప్పించారు. సర్వే పేరుతో తెలంగాణ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్‌కు 65 నుంచి 70 స్థానాలు వస్తాయంటూ గత నెల 20న తనకు సందేశాలు పంపారని, చంద్రబాబు ఒత్తిడితో ఇప్పుడు సర్వేను మార్చి కొత్త కథ చెబుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో లగడపాటి బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ఒత్తిడితో నా సర్వే మార్చానని కెటిఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఎవరో ఒత్తిడి చేస్తే సర్వేలు మార్చే వ్యక్తిని కాదు. నాకు పదవులు కన్నా వ్యక్తిత్వం ముఖ్యం. సెప్టెంబర్ 15 లేదా 16న కెటిఆర్ నా సమీప బంధువుల ఇంట్లో కలిశారు. అప్పట్లో ఎన్నికల విషయంలో నా సాయం కోరారు. దీంతో ఎంఎల్ఎలను మార్చకపోతే ప్రమాదం ఉందని నాకున్న రాజకీయ అనుభవంతో ఆ తర్వాత ఆయనకు సూచనలు చేశా. వారిని మారిస్తే మంచిదని చెప్పా. అరెస్టులు చేయించడం మంచిది కాదని కూడా సూచించా. చంద్రబాబును కలపుకొని వెళితే మంచిదని చెప్పా. కాని ఒంటరిగానే వెళతామని బదులు ఇచ్చారు. మంచి సలహాలు, సూచనలు చేశారని నాకు మెసేజ్ పెట్టారు. నవంబర్ 11 తేదీ నాటికి 37 మంది అభ్యర్థుల విషయంలో సర్వే చేయగా.. కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం ఉందని కేటీఆర్‌కు మెసేజ్ పెట్టా. పోటా పోటీగా ఉన్నప్పుడు అభ్యర్థులే ప్రధానం అవుతారని చెప్పా. మళ్లీ నవంబర్ 20న మరోసారి మెసేజ్ పెట్టా. అప్పటికీ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో గందరగోళం చూసి టిఆర్ఎస్‌కు 65-70 వస్తాయని చెప్పా. వాళ్లకు 35 నుంచి 40 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేశా. దీనిపై కేటీఆర్ స్పందించి దానికంటే ఎక్కువే వస్తాయని నాకు బదులిచ్చారు. ఆ తర్వాత ప్రజల ఆలోచన వేగంగా మారింది. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి తదితర హామీల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. కూటమి కట్టకముందు తెదేపాకు ఉన్న 20 శాతం ఓట్లు తెరాసకు వెళ్లాయి. కూటమి ఏర్పాటు తర్వాత ఆ ఓట్లు తిరిగి ప్రజాకూటమికి మళ్లాయి. ఈ ఉదయం కూడా మళ్లీ సమాచారం వచ్చింది. వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది’’ అని లగడపాటి వివరించారు.