ప్రజాపక్షం/న‌్యూఢిల్లీ : వలస కూలీల కష్టాలను నివారించి, తక్షణమే వారందరికీ తగిన సాయం అందించాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం మంగళవారంనాడొక ప్రకటన విడుదల చేసింది. వలస కార్మికుల ఆకలికేకల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా యుపి, ఢిల్లీ ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చింది. కూలీలు వారి స్వస్థలాలకు వెళ్లకూడదన్న ఏకైక కారణంతోనే పోలీసులు, ఇతర అధికారులు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ పేర్కొంది. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిందని, ఈ పరిస్థితిని ముందే ఊహించి వుండాల్సిందని పేర్కొంది. తగిన సదుపాయాలు కల్పించకుండానే ప్రభుత్వం నిరుపేదల ఆకలిని కొవిడ్ 19 దయాదాక్షిణ్యాలకు వదిలేసిందని విమర్శించింది. ఇప్పటికే వలస కూలీలను పోలీసులు, అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని, తక్షణమే ఈ వేధింపులు ఆపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని సిపిఐ కేంద్రాన్ని కోరింది. ఈ కూలీలు వెనక్కి తిరిగి వెళ్లేలా వారికి ఉచిత పరీక్షలు, ఉచిత చికత్స నిర్వహించి, ఉచితంగా మందులు కూడా అందజేయాలని, అలాగే వారికి ఉచితంగా ఆహారం అందజేయాలని డిమాండ్ చేసింది. వలస కార్మికులు ఉన్న చోటకు ప్రత్యేక బస్సు సర్వీసు ఏర్పాటు చేసి, ఆసుపత్రి సిబ్బంది, నిత్యావసర సేవలను సమకూర్చాలని కోరింది. ఇదిలావుండగా, ఇప్పటికే ప్రధాని సహాయ నిధి వుండగా, కొత్తగా పిఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముచ్చిందో తమకు అర్థం కావడం లేదని సిపిఐ వ్యాఖ్యానించింది.
వలసకూలీలను ఆదుకోండి : సిపిఐ
RELATED ARTICLES