అతిలోక సుందరి, అలనాటి టాప్ హీరోయిన్ శ్రీదేవి, థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించిన ‘మామ్’చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే. జులై 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో శ్రీదేవి మీడియాతో ఇలా మాట్లాడారు…
బోనీ కపూర్‌లాంటి నిర్మాతను ఇంతవరకు నేను చూడలేదు. ఆయన లేకుండా ‘మామ్’ సాధ్యమయ్యేది కాదు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఆయనకే దక్కుతుంది. ‘మామ్’ సినిమా చక్కగా రావాలని నటీనటుల ఎంపిక, వారిని సెట్‌లో చైతన్యపరచడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు’ అని శ్రీదేవి తెలిపారు. అంతేకాకుండా ఆమె తన భర్తతో తన అనుబంధం గురించి అనేక విషయాలను చెప్పారు.
బోనీ భావోద్వేగాలు కలిగిన వ్యక్తి. నన్ను ఎప్పుడూ నవ్విస్తుంటారు. మేం ఒకరికొకరం అండగా నిలుస్తుంటాం’ అని చెప్పారు. ఇంకా ఆమె మాట్లాడుతూ… ‘నేను బోనీతో చాలా నిజాయతీగా ఉంటాను. ఏ విషయాన్నీ దాచిపెట్టను. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఆ మాత్రం కుటుంబం కోసం నేను చేయకపోతే, ఇంకెవరు చేస్తారు. ఇప్పటికీ ఆయన నన్ను గాఢంగా ప్రేమించడం.. నాకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంటుంది. నేను ఆయనను ఎంతగానో ప్రేమిస్తున్నా. రోజులు గడుస్తున్న కొద్దీ ఆయనపై నా ప్రేమ మరింతగా పెరుగుతోంది. దానికి ప్రేమ అనే పేరు సరిపోదు’ అని ఆమె మనసులో మాట చెప్పారు…