ఇరు పార్టీలకు చెరో 38.. కాంగ్రెస్‌కు రెండు సీట్లు
లక్నో: దశాబ్దాల రాజకీయ శత్రుత్వాన్ని వెనక్కునెట్టి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బిఎస్పి అధినేత్రి మాయావతి లోక్‌సభ ఎన్నికల్లో చేతులు కలిపారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో పట్టు సాధించేందుకు ఎస్పి, బిఎస్పి కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఎస్పి అధినేత అఖిలేశ్ యాదవ్, బిఎస్పి అధినేత్రి మాయావతి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాయావతి మాట్లాడుతూ.. యుపిలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలుండగా బిఎస్పి 38 స్థానాల్లో, ఎస్పి 38 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. మిగతా నాలుగు సీట్లను ఇతర పార్టీలకు వదిలినట్లు ఆమె తెలిపారు. అమేథి, రాయ్‌బరేలి స్థానాలను కాంగ్రెస్ కోసం విడిచిపెట్టినట్లు చెప్పారు. ఈ పొత్తుతో దేశ రాజకీయాల్లో సరికొత్త విప్లవానికి దారి తీస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
అఖిలేష్ మాట్లాడుతూ, మాయావతిని అవమానిస్తే తనను అవమానించినట్టేనని, పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఎస్పి-బిఎస్పి కూటమి ఏర్పాటుకు సహకరించిన మాయావతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ఐదేళ్ల బిజెపి పాలనలో పేదలు, రైతులు, దళితులు, మహిళలు, పిల్లలపై అకృత్యాలు మితిమీరాయని ఆరోపించారు. యుపిలో బిజెపి ప్రభుత్వం ప్రజల్లో విద్వేషాలను వ్యాప్తి చేసిందని దుయ్యబట్టారు.