పుణె: కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ రాజకీయాల నుంచి తప్పుకున్న రోజే తాను కూడా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని స్మృతి ఇరానీ అన్నారు. అయితే మోడీ ఇంకా చాలా రోజులు రాజకీయాల్లో ఉంటారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. పుణెలో ఓ కార్యక్రమంలో ‘మిమ్మల్ని ప్రధాన సేవక్ స్థానంలో ఎప్పుడు చూడొచ్చు’ అని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీరు ఆ స్థానంలో నన్ను ఎప్పుడూ చూడలేరు. దేశంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నేతలతో పని చేసే అవకాశం లభించింది. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం ప్రధాన సేవక్(ప్రధాని)గా ఉన్న నరేంద్ర మోదీ రాజకీయాల నుంచి తప్పుకున్న రోజు నేను కూడా రాజకీయాల నుంచి విరమిస్తా’’ అని ఇరానీ అన్నారు. వీలైనంత ఎక్కువ కాలం ప్రజాసేవకే అంకితమవుతానని తెలిపారు. 2019 ఎన్నికల్లో బిజెపి మళ్లీ విజయం సాధించి మోడీ ప్రధాని అవుతారని ఆమె జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేసే విషయం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయిస్తారని ఆమె చెప్పారు. 2014 ఎన్నికల్లో అమేథి నియోజకవర్గ ప్రజలు తనను గుర్తించలేదని, కాని ప్రస్థుతం తాను ఎవరన్నది తెలుసుకున్నారని స్మృతి చెప్పారు. భారత రాజకీయాల్లో సుష్మాస్వరాజ్, స్పీకర్ సుమిత్రా మహాజన్‌లతో తాను స్ఫూర్తి పొందానని స్మృతి ఇరానీ వివరించారు.
మోడీ తప్పుకున్న రోజే నేను కూడా..
RELATED ARTICLES