కారులో అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం
డ్రైవర్‌తో సహా ముగ్గురు అరెస్టు
ముగ్గురు అభ్యర్థులకు చెందిందని వరంగల్ సిపి వెల్లడి
ప్రజాపక్షం/జనగామ: ఎన్నికల సందర్భంగా పోలీసుల తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా శివారులోని పెంబర్తి చెక్‌పోస్టు వద్ద కారులో తరలిస్తున్న 5కోట్ల 80లక్షల 65వేల రూపాయలను పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు. కారును స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్ జనగామ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న ముందస్తు ఎన్నికల సందర్భంగా జనగామ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ పరిధిలో వందకు పైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చెక్‌పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈనెల 7న పోలింగ్ ఉండడంతో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేసినట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం జనగామ పోలీసులు పెంబర్తి చెక్‌పోస్టు వద్ద ఎపి37సికె4985 నంబర్ గల మారుతి షిప్ట్ కారును తనిఖీ చేయగా రూ.5కోట్ల 80లక్షల 65వేలు లభించినట్లు, కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ గోషామహాల్ ప్రాంతానికి చెందిన కీర్తికుమార్ జైన్, డ్రైవర్లు నవరాం, ముత్యం, ప్రశాంత్‌కుమార్ విచారించగా షెల్ కంపెనీ ద్వారా పెద్ద నగరాలకు నగలు పంపిణీ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. పట్టుబడిన నగలులో 1.5 కోట్లు నామా నాగేశ్వర్‌రావుకు, రూ.2కోట్లు వద్దిరాజు రవిచంద్రకు, రూ. 2.3కోట్లు కొండా మురళికి చెల్లించేందేకు తీసుకువెళ్తునట్లు వారు చెప్పారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జనగామ డిసిపి బి.శ్రీనివాస్‌రెడ్డి, ఎసిపి ఎస్.వినోద్‌కుమార్, సిఐ ముసికె శ్రీనివాస్, ఎస్‌ఐ శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో పాల్గొన్న జనగామ సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ శ్రీనివాస్‌లను సిపి రవీందర్ అభినందించారు.