నలుగురు విద్యార్థుల దుర్మరణం
160 కిలోమీటర్ల వేగంతో డివైడర్‌ను ఢీకొన్న కారు
గుంటూరు: గుంటూరులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు- చిలకలూరిపేట రహదారిపై లాల్‌పురం వద్ద దాదాపు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఓ కారు డివైడర్‌ను బలంగా ఢీకొని అదే వేగంతో ఓ లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారు ఢీకొట్టిన వేగానికి లారీ సైతం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఆర్‌విఆర్ అండ్ జెసి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు. వీరు నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా విజయవాడ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రమాద సమయంలో 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ధనుష్, సాయిరామ్, కోటేశ్వరరావు, కపూర్ మృతిచెందారు. మృతులంతా 20 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని గుంటూరు జిజిహెచ్‌కు తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి.