జడ్చర్ల: టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ఎ. రేవంత్‌రెడ్డిని మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆదేశించడంతో విడుదల చేశారు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కొడంగల్ నియోజవర్గంలోని కోస్గిలో మంగళవారం నిర్వహించనున్న బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రేవంత్‌రెడ్డిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. మంగళవారం వేకువ జామున 3 గంటల సమయంలో రేవంత్‌రెడ్డి నివాసంలోకి బలవంతంగా ప్రవేశించిన పోలీసులు గేటు తాళాలు పగులగట్టి అదుపులోకి తీసుకొన్నారు. రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరులు, వాచ్‌మెన్, గన్‌మెన్లను అదుపులోకి తీసుకున్నారు. ఆయన సోదరుడు కొండల్‌రెడ్డిని నాగర్‌కర్నూల్, మరో సోదరుడు తిరుపతిరెడ్డిని వికారాబాద్ తరలించారు. పరిగి వద్ద వాచ్‌మెన్‌ను వదిలివెళ్లారు. అనంతరం కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో అత్యవసర విచారణ జరిపిన అనంతరం రేవంత్‌రెడ్డిని విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని, డిజిపిని ఆదేశించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం నుంచి రేవంత్‌ను విడుదల చేశారు. అయితే అరెస్టు అనంతరం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ స్పందించారు. శాంతిభద్రతల అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేశారని వెల్లడించారు. నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామన్నారు. పోలీసుల తీరుపై రేవంత్‌రెడ్డి భార్య గీత అసంతృప్తి వ్యక్తం చేశారు. తన భర్తను బలవంతంగా తీసుకెళ్లారని, తమ ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే ఊరుకునేది లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని, ఓటుతో బుద్ధి చెప్పాలని గీత కోరారు.
రేవంత్‌రెడ్డి అరెస్టు… విడుదల
RELATED ARTICLES