బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సిఎం కుమారస్వామి హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో సిఎంగా ఉన్న జెడిఎస్ నేత కుమారస్వామికి రకరకాల సవాళ్లు ఎదురువుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత, మంత్రి సి.పుట్టరంగ శెట్టి మాట్లాడుతూ.. తనకు మాత్రం ఇంకా సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రి అని అన్నారు. పుట్టరంగ వ్యాఖ్యలపై కుమారస్వామి స్పందించారు. కాంగ్రెస్ నేతలు హద్దులు దాటుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాటిపై కాంగ్రెస్ నేతలు జాగ్రత్తగా ఉండాలని.. ఈ అంశాలకు తాను బాధ్యుడిని కానని స్పష్టం చేశారు. వాళ్లు ఇంకా ఇలాంటివి కొనసాగించాలనుకుంటే మాత్రం.. తాను పదవి నుంచి దిగిపోవడానికైనా సిద్ధమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల ఎంఎల్ఎలను అదుపులో ఉంచుకోవాలని సూచించారు. కాగా సిద్ధరామయ్య క్యాంపునకు చెందిన ఎంఎల్ఎలు కుమారస్వామిపై విమర్శలు చేస్తున్నారు. సిద్ధరామయ్య మరో ఐదేళ్లు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మరో కాంగ్రెస్ నేత ఎస్‌టి సోమశేఖర్ అన్నారు. సిద్ధరామయ్య కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థులు తనను గెలవకుండా చేశారని, తాను మరో పర్యాయం అధికారంలోకి వచ్చి ఉంటే ఎన్నో అభివృద్ధి పనులు పూర్తిచేసేవాడినని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యల పట్ల కుమారస్వామి ఆగ్రహంగా ఉన్నారు.
ఇలా అయితే.. రాజీనామా చేస్తా…
RELATED ARTICLES