బరేలీ: ఎలుకలు మద్యం తాగాయని పేర్కొనడం ఇదే మొదటి సారి కాదు. గత ఏడాది బీహార్‌లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ఎలుకలు తాగాయని పోలీసులు పేర్కొన్నారు. ఇప్పడు ఉత్తరప్రదేశ్‌లో కూడా ఎలుకలు మద్యం తాగాయట. అలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వెయ్యి లీటర్లకుపైగా మద్యం సీసాలను అవి ఖాళీ చేశాయట. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. యుపిలోని బరేలీ పోలీసులు ఇదే చెబుతున్నారు. వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను గోదాములో భద్రపరచగా వాటిని ఎలుకలు వాటిని తాగేశాయట. వివరాల్లోకి వెళ్లే… బరేలీ కంటోన్మెంట్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన గోదాములో వెయ్యి లీటర్లకుపైగా స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలను పోలీసులు భద్రపరిచారు. ఆ గోదాములోకి దూరిన ఓ కుక్క చచ్చిపోయింది. దాని మృతదేహాన్ని బయటకి తీసేందుకు పోలీసులు గోదామును తెరిచారు. అదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మద్యం సీసాలు కనిపించలేదు. అలాగే, అక్కడున్న మరి కొన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయని, వాటికి రంధ్రాలు ఉన్నాయని గుర్తించారు. ఎలుకలే మద్యం తాగి ఉంటాయని పోలీసులు పై అధికారులకు తెలిపారు. ఈ ఘటనపై ఆ ప్రాంత ఎస్‌పి అభినందన్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. సాధారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మొదట గదుల్లో నిల్వ చేసి, వాటి శాంపిల్స్ తీసుకుని, ఆ తరువాత దాన్ని పారబోస్తారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ… ‘మాయమైన ఆ మద్యంపై వివరాలు తెలపాలని నేను అధికారులను ఆదేశించాను. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని నిబంధనల ప్రకారం నిరుపయోగం అయ్యేలా చేసే ప్రక్రియను ఎందుకు కొనసాగించలేదో తెలపాలని సూచించాను. ఈ విషయంపై వారి నుంచి ఇంకా స్పందన రాలేదు’ అని తెలిపారు.
ఎలుకలు వెయ్యి లీటర్ల మద్యం తాగాయట!
RELATED ARTICLES