హైదరాబాదు నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో , వరంగల్లు పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో పాలంపేట అనే ఊరి దగ్గర… ఓరుగల్లు నేలిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం రామప్ప దేవాలయం. ఎన్నో యుద్ధాలకు, దాడులకు,ప్రకృతి వైపరీత్యాలకు ఈ దేవాలయం తట్టుకుని నిలబడింది.
ఈ ఆలయ నిర్మాణంలో ప్రత్యేకత ఏమిటంటే… అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించారని అంటారు. ఈ ఇటుకలను నీటిలో వేస్తే తేలుతాయని అంటారు. ఈ ఆలయంలో శిల్ప నైపుణ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. భరత నాట్య శాస్త్రమంతా ఇక్కడ శిల్పాల రూపంలో కనిపిస్తుంది. పురాతనమైన ఈ ఆలయాన్ని దర్శించడానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. అలాగే శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఏటా మూడు రోజుల ఎంతో ఘనంగా చేస్తారు.
ఈ ఆలయంలో నందికి ఒక ప్రత్యేకత ఉంది. ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది. ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా? అన్నట్లు ఉంటుంది. ఈ ప్రత్యేకతను చూసేందుకు టూరిస్ట్ లు ఎంతో దూరం నుంచి వస్తుంటారు. అద్భుతంగా చెక్కబడిన, శివుడి వైపు చూస్తున్న నంది ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది.