ఎఫ్‌ఐఆర్ కొట్టేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
10 వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ: సీబీఐఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు చక్కెదురైంది. అవినీతి ఆరోపణల వ్యవహారంలో తనపై కేసును కొట్టివేయాలంటూ అస్థానా వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టిపారేసింది. ఈ కేసులో దర్యాప్తు జరపాల్సిందేనని, 10 వారాల్లోగా ఈ దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ కేసులో తనను తప్పించేందుకు ఓ మధ్యవర్తి ద్వారా రాకేశ్ అస్థానాకు తాను లంచం ఇచ్చినట్లు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సతీశ్ బాబు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రాకేశ్ అస్థానా, సిబిఐ డిప్యూటీ ఎస్‌పి దేవేందర్ కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. అయితే దీన్ని సవాల్ చేస్తూ వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అస్థానా, మిగతా ఇద్దరిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసేందుకు తిరస్కరించింది. అస్థానాపై క్రిమినల్ దర్యాప్తు చేపట్టకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా న్యాయస్థానం రద్దు చేసింది. దీంతో ఈ కేసులో అస్థానాను అరెస్టు చేసే అవకాశముంది.