విశాఖపట్నం : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం చెన్నైకి 775 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ ‘పెథాయ్’ తుపాను ముందస్తు అంచనాల ప్రకారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 17 సాయంత్రం పెథాయ్ తీరం దాటనుంది. ఈ ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల ఉద్ధృతి పెరిగే సూచనలు ఉనట్లు ఇన్‌కాయిస్ హెచ్చరికలు జారీ చేసింది. పెథాయ్ తుపాను నేపథ్యంలో వాతావరణశాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. 15న కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్నిచోట్ల భారీ వర్షాలు, 16, 17న కోస్తాలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అలాగే 17వ తేదీ కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. 16వ తేదీ నుంచి గంటకి 80 కి.మీ నుంచి 110 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.‘పెథాయ్’ తుపాను పరిస్థితులపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు ఆయనకు వివరించారు. జిల్లాల్లో తుపాను ముందస్తు సన్నద్ధతలపై సీఎం ఆర్టీజీఎస్ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేఠా దీనిపై ప్రత్యేక దృష్టి సారించి యంత్రాంగంతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
దూసుకొస్తున్న ‘పెథాయ్’
RELATED ARTICLES