న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం సభ ప్రారంభమయ్యాక రాఫెల్ ఒప్పందం, కావేరీ సమస్యలపై సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో కొద్ది నిమిషాలకే ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను మంగళవారానికి వాయిదా వేశారు. కర్ణాటక, తమిళనాడు మధ్య ఉన్న నీటి వివాదానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ డిఎంకె, అన్నా డిఎంకె ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. మరోవైపు రాఫెల్ ఒప్పందంలో సుప్రీం కోర్టును ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని, ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటికే తాను నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆజాద్ తీరును ఖండించిన అధికార సభ్యులు నినాదాలు చేశారు. రాఫెల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా చర్చకు పట్టుబడుతుండడంపై క్షమాపణలు కోరారు. ఈ నిరసనల మధ్యే రాజ్యసభ వాయిదా పడింది.