HomeNewsLatest Newsపోలీసుల సేవ‌లు అమూల్యం : హైకోర్టు

పోలీసుల సేవ‌లు అమూల్యం : హైకోర్టు

హైదరాబాద్‌ : కోవిడ్‌–19 కారణంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు అందిస్తున్న సేవలు అమూల్యమని హైకోర్టు కొనియాడింది. అదేమారిదిగా కోవిడ్‌–19 వైరస్‌ బారినపడిన వారికి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు ఎనలేనివని కీర్తించింది. ఇంత భారీ విపత్తు నేపథ్యంలో ఒకటి రెండు చోట్ల పోలీసులు దాడులు చేస్తే దానిని అందరికీ ఆపాదించకూడదని, సమస్య జఠిలంగా ఉన్న తరుణంలో పోలీసులు, డాక్టర్లు ఇతరులు చేస్తున్న సేవల కోణంలోనే అందరూ చూడాలని హితవు చెప్పింది. వనపర్తిలో ఇటీవల నిత్యావసర వస్తువుల కోసం తన కుమారుడితో కలిపి వెళ్లిన వ్యక్తిపై పోలీస్‌ కానిస్టేబుల్‌ దాడి చేయడాన్ని ప్రస్తావిస్తూ లాయర్‌ రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా తీసుకుని బుధవారం విచారణ చేసింది. దీనిపై ప్రభుత్వ వివరణ తెలుసుకుని చెప్పాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. గాంధీ హాస్పటల్, ఖమ్మం, నిజామాబాద్‌ల్లో వైద్యులపై దాడులు చేయడాన్ని ప్రస్తావిస్తూ మరో లాయర్‌ రాసిన లేఖను కూడా డివిజన్‌ బెంచ్‌ పిల్‌గా విచారణ చేపట్టింది. వైద్యులే లేకపోతే కరోనా రోగుల పరిస్థితి ఏమిటో అందరూ అర్ధం చేసుకోవాలని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ ఘటనలపై కూడా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని బెంచ్‌ ఆదేశించింది.
కరోనా వైరస్‌ కట్టడికి నిధులు కావాలనే పేరుతో 50 శాతమే పెన్షన్‌ చెల్లించాలని, ఉద్యోగులకు వారి స్థాయిని బటి వేతనాల్లో కోత విధించాలని రాష్ట్ర సర్కార్‌ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమంటూ ఇద్దరు లాయర్లు విడివిడిగా రాసిన లెటర్లను కూడా పిల్స్‌గా తీసుకున్న హైకోర్టు విచారణ చేసింది. పెన్షన్‌ సొమ్ము పెన్షనర్‌ ఆస్తి లాంటిదని, దీనిలో కోత కోసే అధికారం సర్కార్‌కు లేదని, అదే విధంగా వేతనాల్లో కోత కోయడం కూడా చెల్లదని లేఖల్లో పేర్కొన్నారు. సర్కార్‌ స్టాఫ్‌కు కోత కోసిన పాలకులు ప్రైవేటు కంపెనీల్లో సిబ్బంది జీతాలు కోత కోయనీకి వీల్లేదని జీవో ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని, ద్వంద్వ వైఖరిని తెలియజేస్తోందన్నారు. ఈ పిల్స్‌లోనూ సర్కార్‌ వివరణ ఇవ్వాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. హాస్పటల్స్, రైతుబజార్లు, భారీ దుకాణాలు, ప్రభుత్వాఫీసుల వద్ద కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా వైరస్‌ నిరోధక ద్రావకాలు వెదజల్లే ద్వారాల్ని ఏర్పాటు చేయాలంటూ రాసిన లేఖను కూడా హైకోర్టు పిల్‌గా చేసి విచారణ చేసింది. అన్ని కేసుల్లోనూ సర్కార్‌ వివరణ ఇవ్వాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ను బెంచ్‌ ఆదేశించింది. విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments