HomeNewsLatest Newsగాంధీలో ప్లాస్మా థెరపి

గాంధీలో ప్లాస్మా థెరపి

సీరియస్‌ పేషంట్లకు చికిత్స
అనుమతిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం
డాక్టర్‌ రాజారావు నేతృత్వంలో కమిటి
ఐసిఎంఆర్‌, డిసిఐజి అనుమతికి ప్రయత్నాలు
కౌన్సిలర్‌ వ్యవహారం మరిచిపోక ముందే       డిప్యూటీ మేయర్‌ నిర్వాకం
భద్రాద్రి ఎంఎల్‌ఎ వీరయ్యపై కేసు
తెలంగాణలో 20 మంది చిన్నారులకు కరోనా
జగిత్యాలలో 5 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌
 హాట్‌స్పాట్‌లలో అంక్షలు తీవ్రతరం

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : రాష్ట్రంలో పూర్తిస్థాయి కరోనా ఆసుపత్రిగా మారిన గాంధీలో కరోనా వ్యాధికి ప్లాస్మా థెరపి చికిత్సను అందించనున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  గాంధీలోని జనరల్‌ మెడిసిన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రాజారావు నేతృత్వంలో ప్రత్యేక కమిటీని వేశారు. అయితే దీనికి ఐసిఎంఆర్‌, డిసిజిఐ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. అందుకు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే  చైనా, అమెరికా, దక్షి ణ కొరియాతో పాటు పలు దేశాల్లో ప్లాస్మా థెరపి చికిత్సను అందిస్తున్నారు. మన దేశంలో కేరళకు ఈ చికిత్స అందించేందుకు ఐసిఎంఆర్‌ అనుమతి ఇచ్చింది. ఈ చికిత్సను కరోనా సోకి విషమంగా ఉన్న వారికి అందిస్తారు. కరోనా సోకి నయమైన వ్యక్తి  రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి కరోనా సివియర్‌ పేషంట్‌కు ఎక్కిస్తారు. ఇది అతని శరీరంలోని వైరస్‌తో  పోరాడి తగ్గించే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి విషమిస్తుండడం, మరణాల సంఖ్య క్రమేపీ పెరుగుతుండడమే కాకుండా సివియర్‌ పేషంట్ల సంఖ్య కూడా ఎక్కువ అవుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయే కాని ఉపశమనం కలిగించడం లేదు. జగిత్యాల జిల్లాలో తాజాగా 5 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌ నమోదయింది.  ఈ బాలుడికి ఎపిలోని గుంటూరులో ఉన్న హాస్పిటల్‌లో టాన్సిల్స్‌ ఆపరేషన్‌ చేయించి జగిత్యాలకు తీసుకువచ్చారు. బాలుడిని తీసుకువచ్చిన తాతకు మాత్రం కరోనా నెగెటివ్‌ వచ్చింది. అయితే ఈ బాలుడి కుటుంబ సభ్యులందనీని క్వారంటైన్‌కు తరలించారు. అతనితో కాంటాక్ట్‌ అయిన వారి వివరాలను సేకరిస్తున్నారు. తొలుత వృద్ధులకు, ఆతర్వాత యువతకు కూడా కరోనా వ్యాప్తి అధికంగా ఉందని తెలుసుకోగా ఇప్పుడు చిన్నారులకు కూడా కరోనా అదే స్థాయిలో సోకుతోందని తేలిపోయింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌తో చికిత్స పొందుతున్న వారిలో జీరో నుంచి 12 ఏళ్లలోపు బాలురు 20 మంది ఉన్నారు. వీరిలో మూడునెలల చిన్నారి కూడా ఉంది. దీంతో చిన్నారుల కోసం ప్రత్యేక పిల్లల వైద్యనిపుణులను నియమించి ప్రత్యేక వార్డు కేటాయించారు.  తగ్గుతూ, పెరుగుతూ ఉన్న కరోనా కేసులు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను తగ్గించడం లేదు. ఈ నెలలో ఇప్పటి వరకు అతి తక్కువగా బుధవారం 6 పాజిటివ్‌ కేసులే నమోదయినప్పటికీ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తాజాగా వెలుగుచూసిన కేసులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.  అంతే కాదు బుధవారం 400 మంది టెస్టుల ఫలితాలు రాగా వాటిలో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ తేలింది.  మరో 900 మంది రక్త పరీక్షల ఫలితాలు రానున్నాయి. కరోనా నివారణలో కరీంనగర్‌ ఆదర్శమని దేశం మొత్తం కితాబిచ్చిన నేపథ్యంలో తాజాగా ఇక్కడ కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసు కలకలం సృష్టించింది. కరీంగనగర్‌లో మొత్తం 19 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 15 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. అలాంటి చోట బుధవారం కరీంనగర్‌లోని సాహేత్‌నగర్‌కు చెందిన వ్యక్తికి కరోనా సోకింది. ఈయన మర్కజ్‌కు వెళ్లి  వచ్చారు. ఇతనిని క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందించారు. క్వారంటైన గడువు తొలి 14 రోజులే కాకుండా రెండో ఫేజ్‌ మరో 14 రోజులు కూడా గడిచిపోయాయి. అంటే 28 రోజుల పూర్తి గడువు ముగిసిన తర్వాత 29వ రోజు మళ్లీ అతనికి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో కరీంనగర్‌లో మళ్లీ హై అలర్ట్‌ ప్రకటించారు. వికారాబాద్‌లో ఒకే కాలనీలో 15 మందికి పాజిటివ్‌ సోకింది. ఇది ఒకరి నుంచి మరోకరికి కాంటాక్ట్‌ కావడంతో జరిగింది. దీంతో ఈ కాలనీ నుంచి మిగతా కాలనీలకు వ్యాప్తి చెందకుండా అత్యంత పకడ్బందీ చర్యలు చేపట్టారు. కేంద్రం ప్రకటించిన జాబితాలో మన రాష్ట్రంలో 8 హాట్‌స్పాట్‌ ప్రాంతాలు ఉండగా  హాట్‌స్పాట్‌ క్లస్టర్‌గా నల్లగొండ ఉంది. కేసుల నమోదులో రాష్ట్రం మొత్తం మీద హైదరాబాదే ఇప్పటికీ టాప్‌లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌, నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్‌, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలు రోజులు గడుస్తన్నా కొద్ది  కరోనా భయాన్ని ఎక్కువ చేస్తున్నాయి.  హైదరాబాద్‌లో పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆక్టివ్‌ కేసుల్లో 267 నగరంలోనే ఉన్నాయి. కేంద్రం హాట్‌స్పాట్‌గా ప్రకటించిన వెంటనే నగరంతో పాటు రాష్ట్రంలోని మిగిలిన హాట్‌స్పాట్‌లలో గురువారం నుంచి ఆంక్షలు, నిబంధనలు తీవ్రతరం చేశారు. ఒక్కో ఏరియాకు ఎసిపి స్థాయి అధికారిని నియమించి సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలలో జనసంచారం మొత్తానికే ఉండకుండా చర్యలు తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే తీవ్రమైన శిక్ష ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ గురువారం వీటిలోని కొన్ని ప్రాంతాలతో పాటు నగరంలోని పలు చోట్ల నిబనంధనలు ఉల్లంఘించి జనాలు బయటకు వచ్చారు. చాలా చిన్నచిన్న కారణాలు చెబుతున్నారు. దీంతో సరదాగా తిరిగితే ఇలాంటి వారికి పోలీసులు తమదైన శైలిలో ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం మొదలుపెట్టారు. కొంపల్లిలో ఒకరిని ఆపి ప్రశ్నించగా అతడు పావుకిలో టమాటలు, పావుకిలో ఆలుగడ్డలు కొని తీసుకువెళ్తున్నాడు. ఇదేమిటని అడిగితే ఈ పూటకు కూరకోసం అని సమాధానమిచ్చారని, మరి సాయంత్రం ఎలా అంటే మళ్లీ వచ్చి కొని తీసుకుపోతానని చెప్పారని అక్కడి మార్కెట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి తెలిపారు. దీంతో కొంపల్లి మున్సిపాల్టీ అధికారులు నిత్యావసర వస్తువులు, సరకులకు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకే అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఒక జహీర్‌ అనే కౌన్సిలర్‌ తన వార్డులోకి వివరాల సేకరణకు ఎవరు రావద్దని ఆశా వర్కర్లను, ఇతర సిబ్బందిని అడ్డుకుని హల్‌చల్‌ చేసి అరెస్టు అయిన ఉదంతం మరిచిపోకముందే అతనికి మించి హోదాలో ఉన్న మరో ప్రజాప్రతినిధి అదే కంటే ఛీ అనిపించుకునే పని చేశారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రెడ్‌జోన్‌ ఆటోనగర్‌లో ఒకరు వృద్ధురాలు మరణించింది.  దీంతో ఆయన కుటుంబసభ్యులను పోలీసులు, వైద్య సిబ్బంది వారిని క్వారంటైన్‌కు తరలిస్తుండగా పది మంది అనుచరులతో కలిసి వారిని ఎలా తీసుకువెల్తారంటూ అడ్డుకున్నారు. పోలీసులను, వైద్యసిబ్బందిని నివారిస్తూ చాలా సేపు గొడవచేస్తూ హల్‌చల్‌ చేశారు. ఉన్నతాధికారులు చేరుకుని సర్ధిచెప్పినా వినకపోవడంతో డిప్యూటి మేయర్‌ ఇద్రిస్‌ఖాన్‌తో పాటు అతనితో ఉన్న పది మంది అనుచరులను అరెస్టు చేసి కేసులు పెట్టారు. భద్రాద్రి ఎంఎల్‌ఎ గురువారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడంతో పోలీసులు ఎంఎల్‌ఎపై కేసు నమోదు చేశారు. సూర్యాపేట జిల్లాలో ప్రసవవేదనతో ఉన్న మహిళను ఆసుపత్రికి తీసుకువెల్లేందుకు 108కు ఫోన్‌ చేయగా సరైన విధంగా స్పందించలేదు. 108 వాహనం ఆలస్యం కావడంతో రాకముందే ఆ గర్భిణి నడిరోడ్డుపైనే ప్రసవించింది. బిడ్డ, తల్లి క్షేమంగా ఉన్నారు.
ఢిల్లీలో పిజ్జాబాయ్‌ కలకలం
దేశ రాజధాని ఢిల్లీలో పిజ్జాబాయ్‌ కలకలం సృష్టించాడు. ఇతనికి గురువారం కరోనా పాజిటివ్‌ వెలుగుచూసింది. దీంతో ఈ బాయ్‌తో పాటు పనిచేస్తున్న మిగిలిన 16 మంది పిజ్జాబాయ్‌లను క్వారంటైన్‌కు తరలించారు. అయితే కరోనా తేలిన పిజ్జా బాయ్‌ 72 కుటుంబాలకు పిజ్జాలు డెలివరీ చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో ఆయా కుటుంబాలను కూడా క్వారంటైన్‌ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ బాయ్‌ ఇంకా ఎవరెవరికి డెలివరీ చేశారనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. మహారాష్ట్రనే కాకుండా దేశాన్ని కూడా కాస్తా కలవరానికి గురిచేస్తున్న ఆసియాలోనే అతి పెద్ద మురికి వాడ ముంబైలోని ధారావిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ వీధిలో 11 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3081 కరోనా కేసులతో మహారాష్ట్రనే మొదటి స్థానంలో ఉంది. తమిళనాడు, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో కూడా ఆందోళనకర పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కేరళలో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన ఒక వృద్ధుడిని ఆటోలో తీసుకువెల్తుండగా పోలీసులు అడ్డుకుని ఓవరాక్షన్‌ చేయడంతో అతని కొడుకు ఎత్తుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితులు చక్కబడడం లేదు. గురువారం  కొత్తగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో కృష్ణా, పశ్చిమగోదావరి,కర్నూల్‌ జిల్లాల్లో మూడేసి ఉన్నాయి. గుంటూరు పరిస్థితి ఆందోళన కరంగా తయారవుతోంది. సిటిని పూర్తిగా మూసి వేసినప్పటికి కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఈ జిల్లాలో మొత్తం 122 కేసులు నమోదయ్యాయి. కర్నూల్‌, నెల్లూరు జిల్లాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా పరిశీలిస్తే గడిచిన 24 గంటల్లో 941 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 37 మంది మరణించారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 414కు చేరింది. ఇప్పటి వరకు 12380 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 76 మంది విదేశీయులు ఉన్నారు. కోలుకుని  డిస్చార్జి అయిన వారు పోగా ప్రస్తుతం 10477 మంది చికిత్స పొందుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments