దివ్వెల వెలుగులో మెరిసిన భారతావని
అత్యధిక మంది జ్యోతులను కాదని మొబైల్ టార్చ్‌లవైపే మొగ్గు
కరోనాపై పోరుకు ప్రజల సమైక్య సంకల్పం
లైట్లు ఆర్పడం కన్నా తలుపులు మూయడమే మిన్నగా భావించిన జనం
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాడుతున్న భారతదేశం ఐక్య సంకల్పసిద్ధిని ప్రకటించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఆదివారం రాత్రి 9 గంటలకు జ్యోతులు వెలిగించారు. ఎక్కువమంది జ్యోతుల జోలికెళ్లకుండా సెల్‌ఫోన్ టార్చ్‌లు వెలిగించడం గమనార్హం. అయితే ఇంట్లో లైట్లు ఆర్పడమనేది పాక్షికంగానే సాగింది. ఎక్కువమంది లైట్లు ఆర్పకుండా తలుపులు మూసేసి, బయటకు వచ్చి మొబైల్‌ఫోన్ల టార్చ్‌లు వెలిగించి, తమ సంఘీభావం ప్రకటించారు. 9 నిమిషాల పాటు ఈ కార్యక్రమం సాగింది. ఒకేసారి లైట్లు ఆర్పేసి, ఆ తర్వాత ఒకే సమయంలో లైట్లు వెలిగించడం వల్ల పవర్ గ్రిడ్‌లు ఇబ్బందేమీ లేదని అధికారులు చెప్పినప్పటికీ, జనం పెద్దగా పట్టించుకోలేదు. ఇంట్లో లైట్లు ఉంచేసి, తలుపులు బిగించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే నూనె దీపాలకు బదులు మొబైల్ టార్చ్‌లవైపే మొగ్గు చూపారు. ఇంట్లో ఉన్న విద్యుత్ గృహోపకరణాలు అంటే ఫ్రిజ్‌లు, టీవీలు, ఏసీలు, కంప్యూటర్లు ఆపకుండా ప్రజలు గ్రిడ్‌ల ప్రమాదాన్ని చాలా వరకు తప్పించారు. వీధిదీపాలు ఆర్పవద్దని ఆదేశాలిచ్చినప్పటికీ, పలు రాష్ట్రాల్లో వీధిదీపాలను కూడా ఆర్పేశారు. అలాగే పలు చోట్ల రోగులు చికిత్స పొందుతున్న ఆసుపత్రుల్లో సైతం లైట్లు ఆపేశారు. చేతులకు శానిటైజేషన్ చేసుకొని నూనెదీపాలు వెలిగించవద్దని నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో చాలామంది ప్రజలు దీపాలకు దూరంగా వున్నారు. శానిటైజేషన్‌లో ఆల్కహాలు వుండటం వల్ల అది అత్యంత ప్రమాదకరమని ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రధాని ప్రకటన చేసినందున, ఇక చేసేది లేక ఆ 9 నిమిషాల సమయంలో పవర్ గ్రిడ్‌లకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా విద్యుత్ అధికారులు నానా తంటాలు పడాల్సివచ్చింది.