చైనాలో తొలిసారిగా క్లీన్ మండే
బీజింగ్ : కరోనా వైరస్ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అందరి దృష్టి చైనాపైనే వుంది. చైనాలోనే మొదటిసారిగా ప్రాణాంతకమైన ఈ వైరస్ విజృంభించినందున, లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదంలో ఆ దేశం పడింది. అయితే ఈ వైరస్‌కు ఎలాంటి మందు లేనందున, దీని వ్యాప్తిపై అతితక్కువ సమయంలో అద్భుతమైన అధ్యయనం చేసి, సామాజిక దూరం ఒక్కటే దీనికి మార్గమని భావించిన చైనా ఆ సూత్రంతోనే కరోనాపై విజయం సాధించింది. కఠినతరమైన ఆంక్షలతో వుహాన్ ప్రాంతానికి తాళాలు వేసి మరీ, కరోనా వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలిగింది. నెమ్మదిగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. చివరకు అది ఏ దశకు చేరిందంటే, ఏప్రిల్ 6వ తేదీన అంటే సోమవారంనాడు చైనాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అలాగే ఒక్క కరోనా మృతి కూడా సంభవించలేదు. జీరో డేగా మండే (సోమవారం)ను చైనా ప్రకటించింది. ఇది చైనా వైద్యు లు, ప్రజలు సాధించిన గొప్ప విజయంగా ఆ దేశం అభివర్ణించింది. జనవరి నుంచి కరోనా కేసుల సంఖ్య గురించి చైనా ప్రకటిస్తూ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు తొలిసారిగా సోమవారంనాడే జీరో కేసులున్నట్లు తెలిపింది. అయితే ఇంపోర్టెడ్ ఇన్ఫెక్షన్స్ సంఖ్య 983కి పెరిగిందని, దీనికి సంబంధించి 32 కొత్త కేసులను ధృవీకరించినట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సి) మంగళవారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు మొత్తంగా చైనాలో కరోనా కేసుల సంఖ్య 81,740గా, మరణాల సంఖ్య 3,331గా నమోదైంది. 1,242 మంది రోగులు ఇంకా చికిత్స పొందుతున్నారు. రికవరీ తర్వాత 77,167 మంది రోగులు డిశ్చార్జి అయ్యారు.