HomeNewsBreaking Newsఎంపీల వేతనాల్లో కోత

ఎంపీల వేతనాల్లో కోత

ఏడాది పాటు 30 శాతం కట్‌ చేయాలని కేంద్రం నిర్ణయం
ఆర్డినెన్స్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర
రెండేళ్ల పాటు ఎంపీ ల్యాడ్స్‌ నిధులు ఉండవు

న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా దేశంలో విజృంభిస్తున్నందున ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలు అయి న నేపథ్యంలో పొదుపు చేయాల్సిన అవసరం వుం దని కేంద్ర క్యాబినెట్‌ అభిప్రాయపడింది. అందుకోసం ఛారిటీ అనేది ఇంటి నుంచే మొదలు కావాలని భావించి, పార్లమెంటు సభ్యుల వేతనాల్లో కోత విధించాలని కేంద్ర క్యాబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపీల వేతనా ల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం క్యాబినెట్‌ భేటీ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఎంపీల వేతనాలు, పింఛన్లలో 30 శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు  క్యాబినెట్‌లో ఆమోదం తెలిపిందని ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఎంపీలందరి వేతనాల్లో ఏడాది పాటు కోత ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారని వివరించారు. ఈ మొత్తం సంఘటిత నిధికి వెళుతుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ కోత వర్తిస్తుందని పేర్కొన్నారు. అలాగే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్‌ నిధులను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జవదేకర్‌ తెలిపారు. రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం కూడా సంఘటిత నిధికి వెళుతుందన్నారు. శాలరీస్‌, అలవెన్సెస్‌ అండ్‌ పెన్షన్‌ ఆఫ్‌ మంబర్స్‌ ఆఫ్‌ పార్లమెంటు యాక్ట్‌ (1954)ను సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేస్తామని మంత్రి తెలిపారు. ఇది ఏప్రిల్‌ 1 నుంచి అమలయ్యేలా ఏడాది పాటు అమల్లో వుంటుందన్నారు. ప్రతి ఎంపీకి నెలకు లక్ష రూపాయల వేతనం, నియోజకవర్గ అలవెన్స్‌ నెలకు 70,000 వుంటుంది. ఎంపీ లాడ్స్‌ నిలుపుదల వల్ల కొంతమేరకు ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చని అన్నారు ఇది 2021-2022 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుంది. లోక్‌సభలో 543 ఎంపీలుండగా, రాజ్యసభలో 245 మంది వున్నారు. మొత్తంగా 788 మంది సభ్యులున్నారు. అలాగే ఎంపీలాడ్స్‌ కింద ప్రతి ఎంపీకి యేటా 5 కోట్ల రూపాయల నిధులు లభిస్తాయి. లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజలు, దేశం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
మంత్రులతో మోడీ చర్చలు
లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన కీలకమైన 10 నిర్ణయాలు, 10 ప్రాధాన్యతా రంగాలను గుర్తించాలని ప్రధాని నరేంద్‌ మోడీ తన మంత్రివర్గ సహచరులను కోరారు. ఇందుకు సంబంధించి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సోమవారంనాడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేంద్ర మంత్రులతో మోదీ మాట్లాడారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోం మంత్రి అమిత్‌షా, ఇతర సీనియర్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. కోవిడ్‌19పై పోరాటంలో మంత్రుల నాయకత్వ పటిమను ప్రధాని ప్రశంసించారు. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, తగిన చర్యలు చేపట్టేందుకు వీలుగా ఎప్పటికప్పుడు వారు అందిస్తున్న సమాచారం ఎంతో ఉపకరిస్తోందని ప్రధాని అన్నారు. పంటల కోత సీజన్‌లో రైతులకు కేంద్రం అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. సామాజిక దూరంతో పాటు లాక్‌డౌన్‌ ఉపసనమ చర్యలు ఏకకాలంలో సాగాలని మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత తలెత్తే పరిస్థితులు, ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు గుర్తించాలని, 10 కీలక నిర్ణయాలు, పది ప్రాధాన్యతా రంగాల జాబితాను సిద్ధం చేయాలని మంత్రులకు ప్రధాని సూచించారు. రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలతో నిరంతరం మంత్రులు సంప్రదించాలని, అక్కడి వాస్తవ పరిస్థితులపై పూర్తి అవగాహనకు వచ్చి, ఆయా సమస్యలకు పరిష్కారించాలని ప్రధాని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఒక అవకాశంగా తీసుకుని ’మేక్‌ ఇన్‌ ఇండియా’ను మరింత బలోపేతం చేయాలని,ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించాలని మంత్రులకు సూచనలిచ్చారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments