యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం పట్ల సిపిఐ ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. డబ్లుహెచ్‌ఓ చెప్పిన ప్రకారం ట్రేస్, ట్రీట్ పద్దతిని తక్షణమే పాటిస్తూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలోని అన్ని ఆసుపత్రులను క్రియాశీలంగా పనిచేయించాలని, మర్కజ్ నుంచి వచ్చిన ము స్లింలు, ఇతర దేశాల నుండి వచ్చిన ప్రయాణికులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మీ వల్ల మీ కుటుంబం, సమాజం ఇబ్బందులకు గురయ్యే ప్రమాదాన్ని గమనంలోకి తీసుకోవాలన్నారు.
కార్డు లేని పేదలకు బియ్యం ఇవ్వాలి
12 కిలోల బియ్యం అందరికీ అందినప్పటికీ రూ.1500 అందరి ఖాతాల్లో జమ కాలేదని చాడ వెంకటరెడ్డి తెలిపారు. కొంతమంది బ్యాంకు ఖాతాలు రెగ్యులర్‌గా ఆపరేషన్‌లో లేకపోవడం లాంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని అర్హులైన వారందరికీ విఆర్‌ఒ, పంచాయితీ కార్యదర్శి ద్వారా నగదు అందజేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. తెల్ల రేషన్ కార్డులు లేని నిరుపేదల బతుకు ఆగమ్యగోచరంగా మారిందన్నారు. పైస్థాయి నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రానందున కార్డు లేని వారికి బియ్యం ఇవ్వలేక పోతున్నట్లు కిందిస్థాయి అధికారులంటున్నారని, కార్డులు లేని నిరుపేదలకు 12 కిలోల బియ్యం, 1500 నగదు తక్షణమే అందజేయాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తుల వారికి తక్షణమే బియ్యం, ఆర్థిక సహాయాన్ని అందజేయాలని కోరారు. పట్టణాల్లో వలస కార్మికులకు సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని, బియ్యం పంపిణీ చేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే టీచర్లు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లకు గత రెండు మూడు మాసాలుగా వేతనాలు లభించక తిండికి ఇబ్బంది పడుతున్నారని, పై సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.