HomeNewsLatest News24x 7 అందుబాటులో ఉంటా : ప్రధాని మోడీ

24x 7 అందుబాటులో ఉంటా : ప్రధాని మోడీ

ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చు
అందరం కలిసి పనిచేస్తేనే కరోనా మహమ్మారిని తరిమికొట్టగలం
ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో తాను 24×7 అందుబాటులో ఉంటానని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. ఎవరైనా, ఎప్పుడైనా తనకు ఫోన్‌ చేసి సలహాలు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. అందరు కలిసి పనిచేస్తేనే ఈ మహమ్మారిని తరిమికొట్టగలమని పిలుపునిచ్చారు. రాష్ట్రాల్లో కొవిడ్‌ పరిస్థితులు, మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ పొడిగింపుపై అభిప్రాయాలే లక్ష్యంగా శనివారం ప్రధాని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తొలుత కేంద్ర ఆరోగ్యశాఖ దేశంలో తాజా పరిస్థితులను సభ్యులకు వివరించింది. ఈ సందర్భంగా దేశ ప్రజల ప్రాణాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించాల్సిన అవసరాన్ని మోడీ నొక్కి చెప్పారు.  దేశ ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా, ఆరోగ్యవంతమైన భారతం కోసం ప్రజల జీవితంతో పాటు దేశమూ ముఖ్యమేనని మోడీ అన్నారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి  ఇప్పటి వరకు తీసుకున్న చర్యల ప్రభావాన్ని నిర్ణయించడానికి తదుపరి 3,-4 వారాలు  చాలా కీలకమని  పేర్కొన్నారు. కరోనాపై పోరులో భాగంగా 21 రోజుల  లాక్‌డౌన్‌  కాలంలో దేశంలో  కొన్ని అత్యవసర సేవలు తప్ప అన్ని ఆర్థిక కార్యకలాపాలను నిలిపివేశామన్నారు. ఈ సందర్భంగా మార్చి 24 నాటి  తన ప్రసంగంలో జాన్‌ హైతో జహాన్‌ (బతికుంటే…ఆర్థికాన్ని చూసుకోవచ్చు) చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన మోడీ… ఇప్పుడు జాన్‌ బీ, జహాన్‌ భీ (జీవితాలు ,ఆర్థిక వ్యవస్థ ) రెండూ ముఖ్యమైనవే అన్నారు.  అటు ప్రాణాలు, ఇటు ఆర్థిక వ్యవస్థ వైపు చూడాలని అని మోడీ చెప్పారు. ప్రాణాంతక వైరస్‌ నుంచి ఇటు ప్రజల ప్రాణాలను కాపాడుకుంటూనే అటు ఆర్థికవృద్దిని దృష్టిలో పెట్టుకుని గురుతర బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
‘మనం ఉంటేనే ప్రపంచం… అన్నది నిన్నటి మంత్ర, మనము ఉండాలి, ప్రపంచం ఉండాలి… అనేది నేటి మంత్ర. ఇప్పటిదాకా తీసుకున్న చర్యల సత్ఫలితాలు కనిపించాలంటే, మరో మూడు నాలుగు వారాలు చాలా ముఖ్యం. వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారుడికి అందేలా మార్కెటింగ్‌ చట్టాల్లో మార్పులు తీసుకురావాలి. ఆరోగ్య సేతు యాప్‌ ఇకనుంచి ట్రావెల్‌ ఈ పాస్‌ లాగా ఉపయోగపడుతుంది. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది  పైన దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. దేశంలో సరిపోయినన్ని మందులు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి’ అని ప్రధాని స్పష్టం చేశారు.
అనంతరం ఒక్కో ముఖ్యమంత్రి తమ అభిప్రాయాల్ని ప్రధానితో పంచుకున్నారు. చాలా మంది ముఖ్యమంల్రు లాక్‌డౌన్‌ పొడిగించాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, పంజాబ్‌ సిఎం అమరేందర్‌ సింగ్‌ లాక్‌డౌన్‌ను ఈనెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీహార్‌ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దినసరి కూలీలకు మాత్రం మినహాయింపునివ్వాలని కోరింది. ఇప్పుడు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌  మరో రెండు రోజుల్లో ముగియనున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత సిఎంలతో ప్రధాని సమీక్ష నిర్వహించడం ఇది రెండోసారి.
మాస్క్‌ ధరించిన ప్రధాని
కాగా, మోడీ మాస్క్‌ ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సాధారణ మాస్క్‌ కాకుండా తెల్లటి వస్త్రంతో చేసిన మాస్క్‌ వేసుకున్నట్లు చిత్రాల్లో కనిపించింది. అలాగే పలువురు ముఖ్యమంత్రులు సైతం మాస్క్‌ ధరించారు. ఇంట్లో తయారు చేసిన రెండు పొరలతో కూడిన మాస్క్‌ను ధరించొచ్చని గత వారం కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. దానిపై ప్రజల్లో అవగాహన కల్పించేలా మోడీ మాస్క్‌ను ధరించినట్లు తెలుస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments