రాహుల్‌సభకు విశేష స్పందన
ప్రజాపక్షం/( భూపాలపల్లి-గణపురం) : ఊహించినట్లుగానే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫ్రంట్ సభ సక్సెస్ అయింది. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు హాజరు కావటంతో భూపాలపల్లి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలు అన్ని జనసంద్రమయ్యాయి. సభ సక్సెస్ కావటంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేసుకుంటూ ఊత్సాహంగా ఊరి బాటపట్టారు.
ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నాడనే సమాచారంతో జిల్లాల నలు మూలల నుంచి పెద్ద ఎత్తున జనం సభా స్థలికి కదిలారు. మధ్యాహ్నం 1 గంటకు సభ ప్రారంభమవుతుందని తెలిసినప్పటికి ఉదయం నుంచే కదలిలారు. దీంతో పట్టణ ప్రధాన రహదారితోపాటు వీధులన్ని జనంతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి మొదలవగా సమావేశం ముగిసే సమయానికి సైతం ఊళ్ళ నుంచి జనం రావటం కనిపించింది. పట్టణ కేంద్రానికి పక్కనే ఉన్న సీఆర్ నగర్ ఖాళీ ప్రదేశం సుమారు 40 ఎకరాలు ఉండగా ఈ మైదానం అంతా జనంతో నిండిపోయింది. అంతేకాకుండా రహదారులు, పరిసర ప్రాంతాలు సైతం జన సంధ్రంలో మునిగిపోయాయి. తమ ప్రియతమ నాయకుడు మాట్లాడినంత సమయం జనం జేజేలు కొట్టారు.